కారులో ప్రయాణించే వాళ్లంతా కచ్చితంగా సీటు బెట్లు పెట్టుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. పెట్టుకోకుంటే పోలీసులు ఫైన్ వేస్తున్నారు. ఎందుకింత బలవంతంగా సీటు బెల్టు పెట్టుకోవాలని ప్రెజర్ పెడుతున్నారు. 


సీటు బెల్టు ప్రాణానికి రక్ష 


సీటు బెల్టులేక ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో మన కళ్లారా చూస్తున్నాం. ప్రమాదాలు జరిగినా సీటు బెల్టు పెట్టుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. 


వోల్వా కంపెనీ లేకుంటే...
 
మరి సీటు బెల్టు లేని కార్లు ఉంటే పరిస్థితి ఏంటో ఊహించుకోండి. చాలా భయానకంగా ఉంటుంది కదా. రోజుకు ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. వోల్వా కంపెనీ గాని తన కోసమే ఆలోచించి ఉంటే ఈ రోజు ప్రపంచంలో చాలా మరణాలు చూసేవాళ్లం.


వోల్వా సంస్థ చొరవతోనే సీటు బెల్టు 


ఈ సీటు బెల్టు మొదట కనిపెట్టింది..  సీటు బెల్టు ఉన్న కారు తీసుకొచ్చింది వోల్వా సంస్థ. ఆ సంస్థలో పని చేసే నిల్స్‌ బొహ్లిన్ అనే ఇంజినీర్‌ దీన్ని రూపొందించాడు. 


ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన పేరు నిల్స్‌ బొహ్లిన్


నిల్స్‌ బొహ్లిన్‌ మొదట వీ ఆకారంలో ఉంటే సీటు బెల్టును 1959లో కనిపెట్టాడు. ఇది కచ్చితంగా ఆటో మొబైల్ ఇండస్ట్రీనే ఆకట్టుకుంటుందని అప్పుడే ఊహించాడతను. తర్వాత క్రాస్‌ స్ట్రాప్ డిజైన్డ్‌ సీటు బెల్టు కనిపెట్టాడు. ఇది వాటడానికి మరింత సులబతరమైంది. ఇప్పుడు కార్లలో కూడా దీన్నే వాడుతున్నాం. 


కార్లు వాడకం ఊపందుకుంటున్న టైంలో చాలా ప్రమాదాలు జరిగేవి. చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఇదంతా చూసిన స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ ఆలోచనలో పడింది. తమ కార్లు వాడే డ్రైవర్లు, ప్రయాణించే ప్రయాణికుల సేఫ్టీ కోసం ఏదో ఒకటి చేయాలని మాత్రం సంకల్పించింది. ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఈ సీటు బెల్టు. 


ఆ టైంలో వోల్వా సంస్థ ప్రెసిడెంట్‌గా గున్నార్‌ ఎంగెల్యూ ఉన్నారు. ఆయన స్వతహాగా ఇంజినీర్‌ కూడా అవ్వడంతో జరుగుతున్న ప్రమాదాలపై చాలా ఆలోచించారు. తనకు కావాల్సిన వ్యక్తులే రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో వీలైనంత త్వరగా దీనికి పరిష్కారం చూడాలని భావించారు. 


గున్నార్ అలా ఆలోచిస్తున్న టైంలో ఎవరో నిల్‌ బొహ్లీన్ గురించి చెప్పారు. మంచి ప్రతిభ ఉన్న ఇంజినీర్‌ అంటూ ఆయన రికమండ్ చేశారు. అప్పటికే నిల్‌ బొహ్లీన్‌ వోల్వా పోటీదారైన సాబ్‌ సంస్థలో పని చేస్తున్నారు. అయినా నిల్‌ను పిలిచి ఉద్యోగం ఇచ్చారు. వీలైనంత త్వరగా ఈ ప్రమాదాలకు పరిష్కారం చూపించాలని టాస్క్ అప్పగించారు. 


మొదటిది ఫెయిల్


రెండు పాయింట్ల బెట్ల్‌ డిజైన్‌ రెడీ చేశారు నిల్స్‌ బొహ్లిన్‌. ఈ బెల్ట్ వల్ల మనిషి ముందుకు తూలి పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దీని వల్ల సడెన్ బ్రేక్స్ వేసినప్పుడు మనిషి గాయాలు అయ్యే ఛాన్స్‌ ఎక్కువ ఉంది.  ఈ టైప్‌ బెల్ట్‌తో ప్రమాద తీవ్ర తగ్గలేదని గ్రహించింది సంస్థ. ఈ బెల్ట్‌ పెట్టుకున్న వాళ్లు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. 


ఈ ఫీడ్‌ బ్యాక్‌లో బొహ్లిన్ మరింతగా శ్రమించాల్సి వచ్చింది. అప్పటికి తయారు చేసిన బెల్ట్ కంటే మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రజలు ధరించేందుకు సులభంగా ఉండాలని భావించాడు. అంతే కాకుండా కారు ప్రమాదం జరిగినా వెన్నుపూసకు, తలకు, గుండెకు దెబ్బలు తగలకుండా చూడాలనుకున్నాడు. ఒక్క చెయ్యి ఉపయోగించి ప్రమాదం నుంచి బయటపడే మార్గంగా ఉండాలనుకున్నాడు.ఆ మథనం నుంచి వచ్చిందే ఇప్పుడు మనం వాడుతున్న సీటు బెల్టు కాన్సెప్టు. 


ఆరేళ్ల కష్టం 


ఈ సీటు బెల్టు చరిత్ర చెప్పడానికి సులభంగానే ఉన్నప్పటికీ దీన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు ఆరేళ్లు పట్టింది. ఆరోజుల్లోనే కోట్లు ఖర్చు పెట్టింది ఈ పరిశోధనకు. వేల సార్లు పరీక్షలు చేశారు. 1950 నుంచి 1960 మధ్యలో వందల సార్లు టెస్టు రైడ్లు నిర్వహించారు. పదివేలకుపైగా ప్రమాదాలను పరిశీలించారు ఇంజినీర్లు.


ఈ సీటు బెల్ట్ డిజైన్ వోల్వ సంస్థ తన వద్దే ఉంచుకొని ఉంటే లక్షల కోట్లు సంపాదించేందు. ఆ సంస్థ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయేవి. ప్రపంచమంతా వోల్వ వైపు చూసేది. కానీ వోల్వ అలా ఆలోచించలేదు. కోట్లు ఖర్చు పెట్టి ఈ సీటు బెల్టు కనిపెట్టినా ప్రజల జీవితాల కోసం తన పేటెంట్ వదులుకుంది. ఎవరైనా ఈ సీటు బెల్టు కాన్సెప్ట్ వాడుకోవచ్చని బహిరంగంగానే ప్రకటించింది.