Pink Ball Test: ఇండియన్‌ టాప్‌ ఆర్డర్‌ మరోసారి విఫలమైంది! శ్రీలంకతో జరుగుతున్న పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా (Team India) ఇబ్బంది పడుతోంది. తొలిరోజు తొలి సెషన్లోనే నాలుగు కీలక వికెట్లు చేజార్చుకుంది. 29 ఓవర్లకు 93/4తో నిలిచింది. వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ (16; 9 బంతుల్లో 3x4), శ్రేయస్‌ అయ్యర్‌ (1; 6 బంతుల్లో) బ్యాటింగ్‌ చేస్తున్నారు. పిచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు విపరీతంగా స్పందిస్తోంది. ప్రవీణ్‌ జయ విక్రమ, ధనంజయ డిసిల్వా, ఎంబుల్దెనియా తలో వికెట్‌ తీశారు.


సాధారణంగా బెంగళూరు పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుంది. కానీ విచిత్రంగా ఈసారి విపరీతమైన టర్న్‌కు అనుకూలిస్తోంది. మొహాలి పిచ్‌తో పోలిస్తే రెండు డిగ్రీలు ఎక్కువగా బంతి టర్న్‌ అవుతోంది. ఒక్కోసారి అనూహ్యంగా బౌన్స్‌ అవుతోంది. దాంతో బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇన్నింగ్స్‌ ఆరంభం కాగానే మయాంక్‌ అగర్వాల్‌ అనసవరంగా రనౌట్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 10. మరికాసేపటికే రోహిత్‌ శర్మ (15)ను ఎంబుల్దెనియా పెవిలియన్‌ పంపించాడు. హనుమ విహారి (31; 81 బంతుల్లో 4x4), విరాట్‌ కోహ్లీ (23; 48 బంతుల్లో 2x4) కుదుకున్నట్టే కనిపించింది. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్నారు. అయితే ఆడక తప్పని బంతులేసిన లంక స్పిన్నర్లు వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపించారు. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసినా ఆశ్చర్యం లేదు!


మయాంక్ ఔటైన తీరు


టీమ్‌ఇండియాలో ఒక ఓపెనర్‌ ఇలా రనౌట్‌ అవ్వడం 2012 తర్వాత ఇదే తొలిసారి. 2012లో వీరేంద్ర సెహ్వాగ్‌ ఇలాగే ఔటయ్యాడు. ప్రస్తుత మ్యాచులో సురంగ లక్మల్‌ వేసిన 1.4వ బంతిని మయాంక్‌ ఆడాడు. మయాంక్‌ ప్యాడ్లకు బంతి తగలడంతో లంకేయులు ఎల్బీ అప్పీల్‌ చేశారు. అంపైర్‌ అనిల్‌ చౌదరి దానిని తిరస్కరించాడు. అయితే బంతి కవర్స్‌ వైపు వెళ్తుండటంతో మయాంక్‌ పరుగు తీయడం మొదలుపెట్టాడు. అవతలి ఎండ్‌లోని రోహిత్‌ ఇందుకు సిద్ధంగా లేడు. వెనక్కి వెళ్లాలని సూచించాడు. ఇంతలోనే కవర్స్‌లోని జయ విక్రమ బంతిని అందుకొని కీపర్‌ డిక్వెలాకు విసిరాడు. అతడు వికెట్లను గిరాటేశాడు. 


ఔటయ్యాడో లేదో అని వీడియో రిప్లేలను చూస్తే బౌలర్‌ క్రీజు దాటి బంతి వేశాడని తెలిసింది. నోబాల్‌గా ప్రకటించినప్పటికీ మయాంక్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. బెంగళూరు అతడి సొంత మైదానం. దేశవాళీ క్రికెట్లో మయాంక్‌ కర్ణాటకకే ఆడతాడు.