Case Registered Against Tollywood producer Bellamkonda Suresh: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు, నటుడు బెల్లకొండ శ్రీనివాస్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరిపై సీసీఎస్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. తమపై నమోదైన చీటింగ్ కేసుపై నిర్మాత బెల్లంకొండ సురేష్ తీవ్రంగా స్పందించారు. ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశంలో బెల్లంకొండ సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుమారుడ్ని బ్యాడ్ చెయ్యడమే లక్ష్యంగా కొందరు కేసులు వేస్తున్నారని చెప్పారు.
శ్రవణ్‌ను వదిలేది లేదని, అతడి మీద పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు పెడతామనని బెల్లంకొండ సురేష్ తెలిపారు. శ్రవణ్ ఉద్దేశం తమ కుటుంబాన్ని బ్యాడ్ చేయడమేనన్నారు. తమంది ప్రోద్బలంతో శ్రవణ్ తమపై లేనిపోని ఆరోపణలు, ఫిర్యాదులు చేశాడని ఆరోపించారు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది తనకు బాగా తెలుసునని, వాళ్ల మీద లీగల్‌గా పోరాటం చేస్తానని తెలిపారు. చట్టపరంగానే శ్రవణ్‌కు నరకం చూపిస్తాను. కేవలం నామీదకు వచ్చినా వదిలిపెట్టే వాడినని, కానీ నా పిల్లల జోలికి వచ్చిన వాడిని అంత ఈజీగా వదిలి పెట్టేది లేదన్నాడు.
నాతో పాటు నా కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మాపై ఆరోపణలు చేయించారని కొందర్ని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. శ్రవణ్ మాకు పంపిన నోటీస్ ఇప్పటికీ అందలేదని తెలిపాడు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా దొంగ కేసులు వేయడం ఏంటని ప్రశ్నించారు. శ్రవణ్‌ను లీగల్‌గానే ఎదుర్కొని, అతని వెనుక ఉన్న పెద్ద మనిషిని కూడా వదిలి పెట్టేది లేదు. ఆ పెద్ద మనిషి ఒక రాజకీయ నాయకుడని తెలుసునంటూ ట్విస్ట్ ఇచ్చారు. తమ కుటుంబం ఎవరి జోలికి వెళ్లదని, అదే తాము చేసిన తప్పా అని ప్రశ్నించాడు. నాతో పాటు నా కుమారుడి పేరు లాగారు, కనుక ఈ విషయంలో ఎంత పెద్ద మనిషి ఉన్నా వదిలిపెట్టను, అతను క్షమాపణ చెప్పినా నేను వదలను అంటూ బెల్లంకొండ సురేష్ భావోద్వేగానికి లోనయ్యారు.
అసలు కేసు ఏంటంటే..
సినిమా తీయడానికి అవసరం ఉందంటే రూ.85 లక్షలు ఇచ్చానని, ఇప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్, యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మీద బంజారాహిల్స్‌కు చెందిన శ్రవణ్ ఆరోపణలు చేశాడు. 2018లో ఇచ్చిన డబ్బులు ఇంకా తిరిగివ్వలేదని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రవణ్ కోర్టును ఆశ్రయించాడు. 2018లో రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నారని, గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమా అని మరో 35 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదు చేశాడు. నాంపల్లి కోర్టు ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్‌లపై చీటింగ్ కేసు నమోదు చేశారు.