IND vs SL Pink Ball Test: టీమ్‌ఇండియా జోష్‌లో ఉంది! శ్రీలంకతో రెండో టెస్టుకు రెడీ అయింది. చిన్నస్వామి వేదికగా పింక్‌బాల్‌తో (Pink Ball Test) జరిగే పోరులో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ గెలుపు భారత జట్టు మరో అద్భుతమైన రికార్డు సృష్టించనుంది. ఇక మరోవైపు కనీసం ఈ మ్యాచులోనైనా రాణించి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక తపిస్తోంది. కాస్త మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తోంది.
వరుసగా 15వ టెస్టు సిరీస్
హిట్‌మ్యాన్ సేన ఇప్పటికే 1-0తో సిరీస్‌లో ముందడగు వేసింది. రెండో టెస్టు గెలిచినా, డ్రా చేసుకున్న సిరీస్ కైవసం అవుతుంది. దాంతో సొంతగడ్డపై వరుసగా 15 సిరీసులు గెలిచిన జట్టుగా అవతరిస్తుంది. 2012-13లో టీమ్‌ఇండియా చివరి సారిగా ఉపఖండంలో సిరీస్ చేజార్చుకుంది. ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ ఓడిపోలేదు. పదేళ్లుగా జైత్ర యాత్ర కొనసాగిస్తూనే ఉంది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలి సిరీస్ విజయం అందుకోబోతున్నాడు.
కోహ్లీ సెంచరీ కోసం
లంకేయులతో రెండో పోరులో అందరి కళ్లూ విరాట్ కోహ్లీ (Virat Kohli) మీదే ఉండబోతున్నాయి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం అతడికి రెండో సొంత మైదానం లెక్క! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అక్కడే ఎక్కువ మ్యాచులు ఆడాడు. అతడి సెంచరీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తన వందో టెస్టైన మొహాలిలో అతడు త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 28 నెలలుగా అతడు టెస్టు సెంచరీ చేయనే లేదు. మరి తనకు ఇష్టమైన చిన్నస్వామిలో విరాట్ 71వ సెంచరీ చేస్తాడో లేదో చూడాలి. రెండో టెస్టు గులాబి బంతితో జరుగుతోంది. ఇది డే/నైట్ టెస్టు. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ టెస్టు మ్యాచుకు వంద శాతం అభిమానులను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు.
భారత జట్టు
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కోన భరత్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్, ప్రియాంక్ పంచాల్, అక్షర్ పటేల్