Baojun Yep Electric SUV: ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల భారతదేశంలో బడ్జెట్ ఎలక్ట్రిక్ వాహనం కారు కామెట్ ఈవీని విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.98 లక్షలు. ప్రజల్లో ఈ కారుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు 1,184 యూనిట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు కంపెనీ కొత్త బవోజున్ యెప్ అనే కొత్త ఎలక్ట్రిక్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీతో మార్కెట్లో తన షేర్ పెంచుకోవాలనుకుంటోంది. ఎందుకంటే ఎంజీ ఇటీవలే భారతదేశంలో దాని డిజైన్‌ను కూడా పేటెంట్ చేసింది.
ప్రస్తుతం ఎంజీ మోటార్ ఇండియా బవోజున్ యెప్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బవోజున్ యెప్ అనే గ్లోబల్ స్మాల్ ఎలక్ట్రిక్ వెహికల్ (GSEV) ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును రూపొందించారు. ఎంజీ కామెట్‌ను కూడా దీని పైనే రూపొందించారు. ఈ ఎస్‌యూవీ కొంచెం ఎత్తుగా ఉండనుంది. అలాగే బాక్సీ షేప్‌ను పొందుతుంది.
ఈ కారు ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, పోర్స్చే గ్రాఫిక్స్‌తో కొత్తగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, క్వాడ్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్, బలమైన బంపర్ ఉంటాయి. అలాగే ఇది 15 అంగుళాల అలాయ్ వీల్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, గుండ్రని టెయిల్‌ల్యాంప్‌లు, వెనుకవైపు చిన్న వెనుక కిటికీలను కలిగి ఉంది. బవోజున్ యెప్ పొడవు 3,381 మిల్లీ మీటర్లుగానూ, వెడల్పు 1,685 మిల్లీ మీటర్లుగానూ, ఎత్తు 1,721 మిల్లీ మీటర్లుగానూ, వీల్‌బేస్ 2,110 మిల్లీ మీటర్లుగానూ ఉంది.
బవోజున్ యెప్ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉండనుంది. వీటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కాగా మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం అందించారు. బ్యాటరీ టెంపరేచర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, నాలుగు యూఎస్‌బీ పోర్ట్‌లు, ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
బవోజున్ యెప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 28.1 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో 68 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 303 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని బ్యాటరీని డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 35 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేయవచ్చు. అలాగే ఏసీ ఛార్జర్‌తో 8.5 గంటల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400లకు పోటీగా ఉంటుంది. టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడు పోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు 456 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial