మారుతి సుజుకి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ. ఈ కంపెనీ హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్ భారత్ సహా ప్రపంచంలోని అనేక మార్కెట్‌లలో  బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కారుకు సరికొత్త హంగులు జోడించి, కొత్త మోడల్ గా విడుదల చేయబోతుంది. ప్రస్తుతం కంపెనీలో రూపు దిద్దుకుంటున్న ఈ కారు, పరీక్షల దశలో ఉంది. మారుతి స్విఫ్ట్ సరికొత్త మోడల్ కారును జపాన్ లో పరీక్షిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్ తో పాటు అనేక ఇతర మార్కెట్లలోకి ఈ కారును విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మారుతి స్విఫ్ట్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది.  


సరికొత్త కారులో భారీ మార్పులు


మూడవ తరం మారుతి సుజుకి స్విఫ్ట్ 2018 ప్రారంభంలో మొదటిసారిగా పరిచయం చేశారు. గత మూడున్నర సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మార్పులేవీ కంపెనీ తీసుకురాలేదు. ఈ సంవత్సరం చివరిలో లేదంటే 2023 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త మోడల్ రాబోతుంది. అయితే ఇందులో భారీ స్థాయిలో మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   


ఈ ఫీచర్లతో వచ్చే అవకాశం!


స్పై ఇమేజ్ నివేదిక ఆధారంగా..  2023 స్విఫ్ట్, కొత్త ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, అప్‌డేట్ చేయబడిన స్వూపింగ్ బానెట్ స్ట్రక్చర్, అత్యాధునిక  గ్రిల్ సెక్షన్, అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్, రియర్ బంపర్ ల్యాంప్ హౌసింగ్‌లు, అల్లాయ్‌లతో కూడిన రీడిజైన్ షార్ప్ హెడ్‌ల్యాంప్‌లతో రాబోతుంది. కొత్త-తరం స్విఫ్ట్ క్యాబిన్ ఆపిల్ కార్‌ప్లే,  ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రావచ్చు.  అయితే, డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్,  ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ గతంలో మాదిరిగానే ఉండొచ్చు. స్విఫ్ట్ స్పోర్ట్ అంతర్జాతీయ మార్కెట్ల కోసం పలు మార్పులు పొందుతున్నట్లు తెలుస్తున్నది.


ఇంజిన్ ప్రత్యేకత   


భారత్ కోసం, ప్రస్తుత K12 సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఐడిల్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్‌తో గరిష్టంగా 89 bhp పవర్ అవుట్‌పుట్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదంటే ఐదు-స్పీడ్ AMT గేర్ బాక్స్ తో యాడ్ చేయబడి ఉంది.


ఏ కార్లకు పోటీ అంటే?


హ్యుందాయ్ ఐ10, టాటా టియాగో, ఫోర్డ్ ఫీగో కార్లకు మారుతి స్విఫ్ట్ కారు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. భారత్ లో కార్ల అమ్మకాల్లో టాప్ లో ఉన్న హ్యుందాయ్, టాటా కార్లకు ఇప్పటికే స్విఫ్ట్ కారు గట్టి పోటీనిస్తోంది. రాబోయే కారు కూడా ఈ కార్లతో ఢీ అంటే ఢీ అననుంది.


Read Also: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్మురేపుతున్న టాటా, దరిదాపుల్లో లేని ప్రత్యర్థి కంపెనీలు!