వైసీపీ నియోజకవర్గాల వారీగా పరిశీలకుల జాబితా రెడీ అయ్యింది. స్థానికంగా ఉన్న శాసన సభ్యులు, ఇంఛార్జ్‌తో పాటుగా మరో పరిశీలకుడిని నియమించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాడికొండ నియోజకవర్గం నుంచి మెదలయిన పరిశీలకుల నియామకం, ఇప్పుడు ఏపీలోని 175నియోజకవర్గాలకు పూర్తి చేశారు. పరిశీలకుల జాబితాను రెడీ చేసి, జగన్ ముందు తుది ఆమోదానికి ఉంచినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పరిశీలకులు అవసరం ఎందుకొచ్చింది..
ఏపీలో వైసీపీ పార్టీ బలంగా ఉంది. అధికారంలో ఉండటంతో పార్టీకి ఎదురు ఉండే అవకాశం లేదు. దీంతో ఎదైనా సాధ్యం చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రతిపక్షానికి అవకాశాలు ఇవ్వకుండా పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా ముందుకు నడిపించి, తిరిగి 2024లో విజయం సాధించేందుకు అన్ని వైపులా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పరిశీలకులను కూడా నియమించారు. దీని వలన ఇప్పుడున్న శాసన సభ్యుడు, లేదా ఇంఛార్జ్ పై మరింతగా భాద్యత పెరుగుతుందన్నది జగన్ ఆలోచన అంటున్నారు వైసీపీ నేతలు. పరిశీలకులుగా మరో వ్యక్తి నియోజకవర్గంలో పని చేస్తున్నారంటే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఇంఛార్జ్ పై ఉంటుంది, కాబట్టి మెరుగయిన ఫలితాలు సాధించేందుకు వీలుటుందని చెబుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే, లేక ఇంఛార్జ్ కాస్త ఎమరుపాటుగా ఉన్నా, అక్కడ ఉన్న పరిశీలకులు వారిని అలర్ట్ చేసేందుకు వీలుంటుందని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కావాల్సింది స్థానిక ఎమ్మెల్యే, పరిశీలకుల మధ్య మంచి అవగాహనా ఉండాలి. అయితే ఈ విషయంలోనే కొంత అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. అయితే ఇదంతా తాత్కాలికమని, నిదానంగా అన్ని సర్దుకుంటాయని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు.
పరిశీలకుల యోచన అలా మొదలైంది..
వాస్తవానికి ఇప్పటివరకు నియోజకవర్గంలో పార్టీకి ఎమ్మెల్యేనే కింగ్ మేకర్.. అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా ఇంఛార్జ్ గా ఉన్న వ్యక్తే నియోజకవర్గంలో పూర్తిగా చక్రం తిప్పుతారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేతో పాటుగా పరిశీలకుడిగా మరో పోస్ట్ క్రియేట్ చేసి, పార్టీ తరఫున వారిని నియమించటం ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న నూతన విధానం. వాస్తవానికి పరిశీలకుల నియామకం అనేది తొలిసారి తాడికొండ నియోజకవర్గం లో జరిగింది. ఏపీలోని తాడికొండ నియోజకవర్గం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవిపై పార్టీ వర్గాల నుంచి అందిన ఫిర్యాదులు నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ను పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు తాడికొండ నియోజకవర్గానికి పరిశీలకుడిగా నియమించారు. ఈ వ్యవహరం పార్టీలో తీవ్ర వివాదానికి కారణం అయ్యింది. ఇప్పటికీ ఈ వ్యవహరం తాడికొండ నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులానే కొనసాగుతుంది.
ఎమ్మెల్యే శ్రీదేవి, డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గాల మధ్య వివాదం జరుగుతుంది. అక్కడక్కడ ఇరువర్గాలు ఎదురుపడినప్పుడల్లా గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే శ్రీదేవికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. దీంతో కాలమే సమాధానం ఇస్తుందనే ధోరణిలో వైసీపీ అగ్రనేతలు కూడా ప్రేక్షకపాత్రకు పరిమితం అయ్యారు. దీంతో ఇదే సమయంలో అన్ని నియోజకవర్గాలకు కూడా పరిశీలకులను నియమించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీని పై పీకే నివేదికను తీసుకున్న తరువాత పరిశీలకుల నియామకంలో వేగాన్ని పెంచిన వైసీపీ నేతలు, తుది జాబితాను రెడీ చేసి జగన్ ముందు ఉంచారు. ఆయన ఆమోదం తరువాత అధికారికంగా ప్రకటించనున్నారు.
పరిశీలకుల నియామకంలో కీలక నేతలకు ఊరట...
పరిశీలకుల నియామకంలో పార్టీలోని కీలక నేతలకు ఊరట లభించిందనే చెప్పాలి. వాస్తవానికి పరిశీలకుల నియామకాన్ని పార్టీలోని సీనియర్ నాయకులు అంతగా పట్టించుకోలేదు. జగన్ నిర్ణయం కావటంతో ఎమ్మెల్యేలు ఎప్పుడో ఒకే చెప్పారు. పార్టీకి విధేయులుగా ఉంటున్న వారు, పార్టీ జిల్లా అద్యక్షులుగా ఉన్న నియోజకవర్గాలకు, మాజీ మంత్రులు, అగ్రనేతలకు చెందిన నియోజకవర్గాలకు పరిశీలకులుగా నియామకం అయిన వ్యక్తులను బట్టి చూస్తే ఇది అర్థం అవుతుందని పార్టీలోనే చర్చ నడుస్తుంది. ఆయా నియోజకవర్గాలకు బాధ్యులుగా ఉన్నవారు సిఫార్సు చేసిన వారిని పరిశీలకులుగా నియమించారని ప్రచారం జరుగుతోంది.
YSRCP Observers: అన్ని నియోజకవర్గాలకు వైసీపీ పరిశీలకుల జాబితా రెడీ, త్వరలోనే సీఎం జగన్ ప్రకటన - కొత్త సమస్యలు తప్పవా !
Harish
Updated at:
29 Oct 2022 01:03 PM (IST)
Edited By: Shankard
స్థానికంగా ఉన్న శాసన సభ్యులు, ఇంఛార్జ్‌తో పాటుగా మరో పరిశీలకుడిని నియమించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
NEXT
PREV
Published at:
29 Oct 2022 10:51 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -