Mahindra & Mahindra: మహీంద్రా వాహనాలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. అలాగే కంపెనీ గత కొన్ని నెలలుగా ప్రతి నెలా సగటున 51,000 యూనిట్ల బుకింగ్‌లను అందుకుంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్) ఫలితాల గురించి మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో, అగ్రికల్చరల్ బిజినెస్ ఈడీ, సీఈవో రాజేష్ జెజురికర్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ఒకటో తేదీ నాటికి కంపెనీ 2.86 లక్షల యూనిట్ల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అయితే ఆర్డర్ క్యాన్సిలేషన్ రేటు మాత్రం సింగిల్ డిజిట్‌లోనే ఉంది. కేవలం 8 శాతం మాత్రమే క్యాన్సిలేషన్ రేటు ఉండటం విశేషం.


ఎస్‌యూవీలే ఎక్కువ
ప్రస్తుతం ఎక్స్‌యూవీ300, ఎక్స్‌యూవీ400 కోసం 10,000 యూనిట్ల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఎక్స్‌యూవీ700, థార్, స్కార్పియోల కోసం ఏకంగా 70,000 యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని కార్లను డెలివరీ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుందని, వెయిటింగ్ పీరియడ్ తగ్గించడంపై నిరంతరం దృష్టి సారిస్తోందని జెజురికర్ తెలిపారు.


2023 జూలై, సెప్టెంబర్ మధ్య మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం 1,14,742 ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది కొన్ని సంవత్సరాల క్రితం అమ్మకాలతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ. కంపెనీ వరుసగా ఐదు త్రైమాసికాలుగా దేశంలో రెండో అతిపెద్ద ఎస్‌యూవీ తయారీదారుగా ఉంది.


సెప్టెంబర్ చివరి నాటికి ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా మార్కెట్ వాటా 19.9 శాతానికి పెరిగింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెవెన్యూ విషయంలో నంబర్ వన్‌గా కొనసాగడంపై కంపెనీ నమ్మకంగా ఉందని జెజురికర్ చెప్పారు. 


మరోవైపు మహీంద్రా 2026 అక్టోబర్ నాటికి ఐదు బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ కాన్సెప్ట్ కార్లను యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2022 ఆగస్టు 15వ తేదీన ప్రదర్శించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ8 ఎలక్ట్రిక్ SUV ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఎలక్ట్రిక్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. దీని ఇంటీరియర్ ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ700 తరహాలోనే ఉంటుంది. ఈ కారు పొడవు 45 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 10 మిల్లీమీటర్లుగా ఉంది. వీల్‌బేస్ 7 మిల్లీమీటర్ల కంటే కాస్త ఎక్కువగా ఉండనుంది. 80 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో చూడవచ్చు. ఈ కారు 2024 డిసెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


2021 మే నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700కు సంబంధించిన కూపే వెర్షన్‌ను తీసుకురావాలని కంపెనీ భావించింది. ఈ కారు పేరు ఎక్స్‌యూవీ 900 అయ్యే అవకాశం ఉంది. ఎక్స్‌యూవీ 900 వెనుక భాగంలో కొంచెం వాలుగా ఉండే పైకప్పును పొందుతుంది. ఇది ఎలక్ట్రిక్ మోడల్ ఎక్స్‌యూవీ.ఈ9 పేరుతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీని ఇంజిన్ మాత్రం ఎక్స్‌యూవీ.ఈ8 మాదిరిగానే ఉండవచ్చు. అయితే దీని బాడీ స్టైల్ డిఫరెంట్‌గా ఉండనుందని మాత్రం లుక్ చూసి చెప్పవచ్చు. ఈ కారు 2025 ఏప్రిల్ నాటికి లాంచ్ కానుందని సమాచారం.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!