AP Caste Census 2023: ఏపీలో సమగ్ర కుల గణనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 27 నుంచి ప్రక్రియను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌ విధానంలో చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్‌ సిద్ధం చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ కుల గణన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 


వాలంటీర్లు దూరం


న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో వాలంటీర్లను ఇందులో భాగస్వామ్యం చేయడం లేదని తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, సమాచారాన్ని సేకరిస్తారు. వీరు సేకరించిన సమాచారంపై అధికారులు రీవెరిఫికేషన్ కూడా నిర్వహిస్తారు. ప్రతి సచివాలయ పరిధిలో 10 శాతం ఇళ్లల్లో రీ వెరిఫికేషన్ చేస్తారు. ఓ ప్రత్యేక అధికారితో రీ వెరిఫకేషన్ ప్రక్రియ సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా పూర్తి చేసేందుకు ప్రాంతీయ స్థాయిలోనే సన్నాహక సమావేశాలను నిర్వహించబోతుంది. బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఈ గణన జరగనుంది. జిల్లా స్థాయిలో 15, 16 తేదీల్లోనూ ప్రాంతీయ స్థాయిలో 17 నుంచి 24 వరకు రాజమహేంద్రవరం, కర్నూలు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో సదస్సులు నిర్వహించనుంది. 6 నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 


సంపూర్ణ సామాజిక సాధికారతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం సమగ్ర కుల గణనకు శ్రీకారం చుట్టింది. సమాజంలో అణగారిన వర్గాల వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా ఫలాలు అందించేందుకు వీలుగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వైసీపీ సర్కార్ తెలిపింది. దాదాపు శతాబ్దం తరువాత చేస్తున్న కుల గణన ద్వారా రాష్ట్రంలో మరిన్ని పేదరిక నిర్మూలన పథకాలు, మానవ వనరుల అభివృద్ధితో పాటు సామాజిక అసమానతలు రూపుమాపేలా ప్రణాళిక రూపొందించవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కుల గణన కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం గత అక్టోబర్‌లో నిర్ణయించింది. ఇందులో భాగంగా వెనుకబడిన తరగతి కులాలైన వర్గానికి చెందిన ఉపకులాలు, వాటిలో జనాభా సంఖ్యను గణన చేయనున్నారు. మొత్తం 139 వర్గాలుగా బీసీ కులాలకు ఉపయుక్తంగా ఉండేలా గణన కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం బీసీ కులాల గణన చేపట్టాలని గత కొన్నేళ్లుగా వెనుకబడిన వర్గాలకు చెందిన కులాల ప్రజలు కుల గణన చేపట్టాలని ప్రభుత్వాలను కోరుతున్నాయి. 


కుల గణనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కులగణన అమల్లో ఉంది. బీహార్ ప్రభుత్వం కులాల ఆధారంగా డేటాను సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా కుల గణనపై సమాచారాన్ని సేకరించేందుకు సర్వేలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా కుల గణనపై ముందడుగు వేసింది.