Revanthreddy: అచ్చంపేట బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గువ్వల బాలరాజే కనిపించిన వారిపై దాడి చేశారని చెప్పారు. గువ్వల బలరాజు డబ్బులు పంచడానికి వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, అయితే పోలీసులు బాలరాజును అడ్డుకోకుండా తమపైనే తప్పుడు మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.  ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమేనన్న ఆయన, రాజకీయ లబ్ధి కోసం గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. దండుపాళ్యం, కాళకేయ ముఠాలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయని అన్నారు. సైబర్ క్రైమ్ లో గజరావు భూపాల్ తమ ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంత జరుగుతున్నా ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.


'కుట్రలో భాగమే'


కాంగ్రెస్ పార్టీపై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు పన్నుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 'ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణం. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఏపీలో కోడికత్తి ఘటన, బంగాల్‌లో మమతాబెనర్జీ కాలికి గాయం ఘటనలు ఇందుకు ఉదాహరణ. కొత్త ప్రభాకర్ రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమే. సంచలనం కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. ఇంత వరకూ నిందితుడు రాజును మీడియాకు చూపలేదు.' అని అన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలని, నిందితుడు రాజు కాల్‌ రికార్డు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.


కేటీఆర్ పై విమర్శలు


గువ్వల బాలరాజును ఆస్పత్రిలో పరామర్శించిన కేటీఆర్, తమపై అనవసర ఆరోపణలు చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరో 3 కుట్రలు జరుగుతాయని కేటీఆర్ స్పష్టంగా చెప్పారని, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 'ఫాక్స్‌కాన్‌ బెంగుళూరు తరలిస్తున్నట్టు.. డీకే శివకుమార్‌ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారు. కర్ణాటకలో హంగ్‌ రావాలని బీజేపీ, జేడీఎస్‌ ప్రయత్నించాయి. కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను హరీశ్‌రావు ఎందుకు సమన్వయం చేశారు? కర్ణాటక నుంచి కిరాయికి మనుషులను రప్పించి తెలంగాణలో ప్రదర్శనలు చేయిస్తున్నారు. వీటిపై ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటోంది? ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


'2 ముఠాలు ఒక్కటయ్యాయి'


ఎన్నికలు మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ డ్రామాలు మొదలు పెట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మోదీ, కేసీఆర్, ఎంఐఎంలు అన్నీ కలిసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సానుభూతి కోసం కేటీఆర్, హరీష్ రావు ఆడే డ్రామాల పరిణామాలపై ఎన్నికల అధికారులు ఎందుకు స్పందించడం లేదని, దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా, కాళకేయ ముఠా ఒక్కటయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బీఆర్ఎస్ నేతల డ్రామాలు నమ్మకుండా, వీటి నుంచి బయటపడి కల్వకుంట్ల కుటుంబ నాటకాలకు తెర దించాలని పేర్కొన్నారు.


Also Read: Guvvala Balaraju Discharge: 'ప్రజల దీవెనలతోనే బతికి బయటపడ్డా' - బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భావోద్వేగం, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి