ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భాగంగా మొత్తం 1,510 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్‌ నాగరాణి నవంబరు 11న ఒక ప్రకటనలో తెలిపారు. రెండు విడతల కౌన్సెలింగ్, స్పాట్ కౌన్సెలింగ్ తర్వాత.. ప్రైవేటు కళాశాలల్లో మిగిలిన సీట్లకు మాత్రమే మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 221 ప్రైవేటు కళాశాలల్లో 27,764 సీట్లు అందుబాటులో ఉండగా.. 1,510 సీట్లు భర్తీ అయ్యాయి. మూడో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా బ్రాంచిలు, కళాశాలల ఎంపికకు మొత్తం 1,735 మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,510 మందికి సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబరు 14లోపు సంబంధిత కళాశాలల్లో చేరాలని కన్వీనర్‌ సూచించారు.


కళాశాలలో రిపోర్టింగ్ కోసం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు..


➥ ఏపీఈఏపీసెట్-2023 ర్యాంక్ కార్డ్


➥ ఏపీఈఏపీసెట్-2023 హాల్ టికెట్


➥ ఆధార్ కార్డ్


➥ S.S.C లేదా అందుకు సమానమైన మార్కుల మెమో


➥ ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన మెమో-కమ్-పాస్ సర్టిఫికేట్


➥ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C)


➥ 01-01-2020న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్ (వర్తిస్తే) లేదా తెల్ల రేషన్ కార్డు ఉండాలి.


➥ తహసీల్దార్ జారీ చేసిన EWS ఇన్‌కమ్ సర్టిఫికేట్, 2023-24 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యేది. (వర్తిస్తే)


➥ అధికారులు జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్


➥ అభ్యర్థికి ఇన్‌స్టిట్యూషల్ ఎడ్యుకేషన్ లేనిపక్షంలో అర్హత పరీక్షకు ముందు 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్


➥ స్థానికేతర అభ్యర్థులకు సంబంధించి, అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కింద కేటాయింపు కోసం వారిని పరిగణనలోకి తీసుకోవాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.


ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 6న ప్రారంభమైంది.  అభ్యర్థులు నవంబరు 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకున్నారు. అభ్యర్థులు నవంబరు 8న అర్ధరాత్రి 12 గంటల వరకు ఆప్షన్లు మార్చుకున్నారు. ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అధికారులు నవంబరు 11న సాయంత్రం 6 గంటల తర్వాత సీట్లను కేటాయించారు. ఇప్పటి వరకు ఏ కేటగిరిలోనూ సీట్లు రాని విద్యార్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించారు.


ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఇంజినీరింగ్ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారనుకున్న అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి షాకిచ్చిన సంగతి తెలిసిందే. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పక్కనపెడుతూ.. నేరుగా 'స్పాట్‌' ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబరు 4న ప్రారంభమైన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరు 18 వరకు కొనసాగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్ మాత్రమే ఉన్నత విద్యామండలి నిర్వహించింది. దీనిపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించింది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...