Uttarakhand Tunnel Collpase: 



కుప్ప కూలిన సొరంగం..


Tunnel Collpase: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ టన్నెల్ కింద కనీసం 36 మంది చిక్కుకున్నట్టు సమాచారం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న SDRF బృందం సహాయక చర్యలు మొదలు పెట్టింది. ఉత్తరకాశీలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. పోలీస్ రెవెన్యూ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ శిథిలాల కింద 36 మంది చిక్కుకున్నారు. వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైన రెస్క్యూ ఎక్విప్‌మెంట్‌తో శిథిలాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. 


"పోలీస్‌ టీమ్స్‌తో పాటు, NDRF,SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 36 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం. వాళ్లందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. ఇప్పటి వరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. అందరూ సేఫ్‌గానే ఉన్నారు"


- ఉత్తరకాశీ పోలీసులు 






ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. పూర్తి స్థాయిలో ఈ ప్రమాదంపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు.


"నాకిప్పుడే ఈ ఘటన గురించి సమాచారం అందింది. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నాను. అక్కడి పరిస్థితులు ఆరా తీస్తున్నాను. NDRF,SDRF బృందాలు ఘటనా స్థలంలోనే ఉన్నాయి. అందరూ సురక్షితంగా బయటపడాలని కోరుకుంటున్నాను"


- పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి