PM Modi: 


లేప్చాలో దివాళి వేడుకలు..


ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్‌ప్రదేశ్‌లోని లేప్చా (Lepcha) చేరుకున్నారు. అక్కడ భద్రతా బలగాలతో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు వెళ్లారు. ఈ మేరకు అధికారికంగా ట్వీట్ చేశారు. అంతకు ముందు దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. "ఎంతో ధైర్యవంతులైన మన భద్రతా బలగాలతో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు లేప్చాకి వచ్చాను" అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి ఏటా ఇండియన్ ఆర్మీతోనే దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. 2014లో జమ్ముకశ్మీర్‌లోని సియాచెన్‌కి వెళ్లారు. ఆ తరవాతి సంవత్సరం అమృత్‌సర్‌కి వెళ్లారు. 2016లో హిమాచల్‌ప్రదేశ్‌లోని Lahaul-Spiti కి వెళ్లి అక్కడి సైనికులతో దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధాని. ఆ తరవాత 2017లో జమ్ముకశ్మీర్‌లోని గురెజ్ వ్యాలీకి వెళ్లారు. 2018లో ఉత్తరాఖండ్‌ చమోలిలో పండుగ చేసుకున్నారు. 2020లో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో, 2021లో కశ్మీర్‌లోని నౌశేరా సెక్టార్‌కి వెళ్లారు. గతేడాది కార్గిల్‌కి వెళ్లిన ప్రధాని అక్కడే దీపావళి చేసుకున్నారు. 






"దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరి జీవితాల్లోనూ ఈ పండుగ వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు. ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను"


- ప్రధాని నరేంద్ర మోదీ






ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. భద్రతా బలగాల ధైర్య సాహసాలు ఎనలేనివని కొనియాడారు. అత్యంత సంక్లిష్టమైన ప్రాంతాల్లో పహారా కాస్తున్న వాళ్లందరికీ అభినందనలు తెలిపారు. పండుగ సందర్భంగా వాళ్లందరికీ మిఠాయిలు పంచారు. కొందరు సైనికులకు ఆయనే స్వయంగా స్వీట్స్ తినిపించారు. సైనికులకు భారతీయులు ఎప్పటికీ రుణపడి ఉంటారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 


"భద్రతా బలగాల ధైర్య సాహసాలు ఎనలేనివి. అయిన వాళ్లకు దూరంగా చాలా సంక్లిష్టమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి యోధుల పట్ల భారత్ ఎప్పుడూ రుణపడి ఉంటుంది"


- ప్రధాని నరేంద్ర మోదీ