Mahindra Bolero Neo Plus Launched: మీరు బడ్జెట్ ధరలో లభించే పెద్ద కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, భారతీయ మార్కెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్ కారు విడుదల అయింది. మహీంద్రా బొలెరో నియో ప్లస్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఇది 9 సీటర్, మూడు వరుసల ఎస్‌యూవీ. బొలెరో నియో ఎస్‌యూవీకి సంబంధించిన అప్‌డేటెడ్ మోడల్. మహీంద్రా లాంచ్ చేసిన ఈ కొత్త కారు టీయూవీ300+ లాగా ఉంది. ఇది బీఎస్6 ఎమిషన్ రూల్స్ కారణంగా 2020లో లాంచ్ అయింది. ఇప్పుడు మరోసారి బొలెరో నియో ప్లస్ రూపంలో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
బొలెరో నియో ప్లస్ ఫీచర్లు
బొలెరో నియో ప్లస్ డిజైన్ బొలెరో నియో తరహాలోనే ఉంటుంది. అయితే దీని ఫ్రంట్ బంపర్‌కి ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, బుల్ బార్ వంటి ఫీచర్లు జోడించారు. ఈ కారులో కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు. బొలెరో నియో ప్లస్... బొలెరో నియో కంటే 405 మిల్లీమీటర్లు పొడవుగా ఉంది. బొలెరో నియో ప్లస్ పొడవు 4,400 మిల్లీమీటర్లుగా ఉంది. దీని వీల్ బేస్ లో ఎలాంటి మార్పు లేదు.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?
మహీంద్రా కొత్త కారు ఇంజిన్
మహీంద్రా ఈ కొత్త కారులో స్కార్పియో శ్రేణి ఇంజిన్‌ను అమర్చారు. బొలెరో నియో ప్లస్‌లో 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 120 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 280 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారులో 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉంది. బొలెరో నియోలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 100 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.
మహీంద్రా బొలెరో నియో ప్లస్ ఇంటీరియర్, ధర
మహీంద్రా బొలెరో నియో ప్లస్ తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ కారులో కొత్త స్టీరింగ్ వీల్ అమర్చారు. అంతేకాకుండా దాని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అప్‌డేట్ చేశారు. బొలెరో నియో ప్లస్ 2-3-4 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో మూడు వరుసల సెటప్‌ను కలిగి ఉంది. ఈ వాహనం చివరి వరుసలో సైడ్ ఫేసింగ్ సీట్లు అమర్చారు. ఈ మహీంద్రా కారులో బ్లూటూత్, యూఎస్‌బీ, ఆక్స్ కనెక్టివిటీ కూడా అందించారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.