Honda WR-V SUV: హోండా కార్స్ ఇండియా ఎలివేట్ మిడ్ సైజ్ ఎస్‌యూవీని జపాన్‌కు ఎగుమతి చేయడం ప్రారంభించింది. మేడ్ ఇన్ ఇండియా హోండా ఎలివేట్ డబ్ల్యూఆర్-వీ బ్రాండ్ పేరుతో జపాన్ మార్కెట్‌లో విడుదలైంది. హెచ్‌సీఐఎల్ కంపెనీ భారతదేశం నుంచి జపాన్‌కు ఏదైనా మోడల్‌ను ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి. దేశంలో పెరుగుతున్న ఉత్పాదక శక్తి, ప్రపంచ పోటీని ఇది ప్రతిబింబిస్తుంది.
కంపెనీ ఏం చెప్పింది?
ఈ సందర్భంగా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ టకుయా సుమురా మాట్లాడుతూ, ‘మేడ్ ఇన్ ఇండియా' ఎలివేట్‌ను జపాన్‌లో డబ్ల్యూఆర్-వీగా ప్రారంభించడం మనందరికీ గర్వకారణం. హోండా ప్రపంచ వాణిజ్య వ్యూహంలో హోండా కార్స్ ఇండియా పెరుగుతున్న ప్రాముఖ్యతను మా తయారీ శక్తి నిర్ధారిస్తుంది. సరికొత్త హోండా ఎలివేట్ భారతీయ మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మా వ్యాపారానికి ఇది ప్రధాన మోడల్‌గా మారింది. ఈ విజయాన్ని పునరావృతం చేయగలమని, మా గ్లోబల్ కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యత, నిర్మాణాన్ని అందించగలమని మేం విశ్వసిస్తున్నాం.’ అన్నారు హోండా ఎలివేట్ గత సంవత్సరం సెప్టెంబర్‌లో భారతదేశంలో తన ఎంట్రీ ఇచ్చింది.
దేశంలో గత 6 నెలల్లో కంపెనీ ఎలివేట్‌కు సంబంధించి 30,000 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించింది. ఈ మోడల్ జపాన్‌లో హోండా డబ్ల్యూఆర్-వీ పేరుతో 2023 డిసెంబర్‌లో లాంచ్ అయింది. వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. జపనీస్ స్పెక్ మోడల్ మూడు వేరియంట్‌లను పొందుతుంది. ఎక్స్, జెడ్, జెడ్ ప్లస్. మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అవి ఇల్యూమినా రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, గోల్డ్ బ్రౌన్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్.
ఇండియా స్పెక్ ఎలివేట్ లాగానే జపాన్ కోసం కొత్త హోండా డబ్ల్యూఆర్-వీ ఏడీఏఎస్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో కొలిజన్ అవాయిడెన్స్ ఎమర్జెన్సీ బ్రేక్, ఫాల్స్ స్టార్ట్ ప్రివెన్షన్ ఫంక్షన్, రోడ్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ సపోర్ట్ సిస్టమ్, సైన్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయి. రికగ్నిషన్ ఫంక్షన్, ఆటో హై బీమ్, పార్కింగ్ సెన్సార్ సిస్టమ్‌తో సహా అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్ ఇలా...
ఇది సిటీ సెడాన్‌లో కనిపించే 1.5 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 121 బీహెచ్‌పీ పవర్‌ని, 145 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ యూనిట్ ద్వారా ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌కు ఇది లింక్ అయింది. అయితే ఇండియా స్పెక్ మోడల్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా అందుబాటులో ఉంది.