దేశీయ ఆటోమోటివ్ చరిత్రలో కైనెటిక్ లూనా ఒకప్పుడు కీలక పాత్ర పోషించింది. సుమారు 50 సంవత్సరాల క్రితం కైనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. సరసమైన ధర, సౌలభ్యం కారణంగా లూనా బాగా ప్రజాదరణ పొందింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా లూనా పట్ల ఆసక్తికనబర్చారు. ఒకానొక సమయంలో కైనెటిక్ ఇంజనీరింగ్ రోజుకు దాదాపు 2,000 యూనిట్ల లూనాను విక్రయించిందంటే ఏ స్థాయిలో పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. రాను రాను లూనాకు ఇతర కంపెనీల నుంచి పోటీ పెరిగింది. కొత్త ఉద్గార, భద్రతా నిబంధనలతో కంపెనీ  క్రమంగా దానిని తొలగించింది.

మార్కెట్లోకి ఇ-లూనా మోపెడ్!

ఒకప్పుడు  భారతీయ మార్కెట్లో సత్తా చాటిన లూనా మోపెడ్ ఇప్పుడు మార్కెట్లో తిరిగి అడుగుపెట్టబోతోంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ మోపెడ్ గా అందుబాటులోకి రాబోతోంది.  కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకురాలు, CEO అయిన సులజ్జ ఫిరోడియా మోత్వాని ఇటీవల లూనా లాంచ్ గురించి ఓ ట్వీట్ చేశారు. త్వరలో ఇ- లూనాను తీసుకురాబోతున్నట్లు ఆమె సూచన ప్రాయంగా వెల్లడించారు.  పుణెకు చెందిన కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ప్రస్తుతం    ఎలక్ట్రిక్ లూనాపై పని చేస్తోంది. మోపెడ్ ఎలక్ట్రిక్ వెర్షన్ కైనెటిక్ ఇంజినీరింగ్  సోదర సంస్థ అయిన కైనెటిక్ గ్రీన్ ద్వారా ప్రారంభించబడుతుంది.

ఇప్పటికే ఇ-లూనా తయారీ ప్రారంభం?

నివేదికల ప్రకారం, కైనెటిక్ ఇంజనీరింగ్ ఇప్పటికే ఎలక్ట్రిక్ లూనా కోసం ఛాసిస్ ఉత్పత్తిని ప్రారంభించింది. నెలకు 5,000 యూనిట్ల ప్రారంభ సామర్థ్యంతో ప్రత్యేక ఉత్పత్తి లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. భారత మార్కెట్లో కైనెటిక్ గ్రీన్ ఇప్పటికే 4 ద్విచక్ర వాహనాలను కలిగి ఉంది.  Zing HSS (హై స్పీడ్), జింగ్, జూమ్, ఫ్లెక్స్ లాంటి మోడళ్లను అందిస్తుంది. ద్విచక్ర వాహనాలే కాకుండా, కైనెటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ త్రీవీలర్స్, బగ్గీలను కూడా తయారు చేస్తోంది. ప్రస్తుతం ఇ-లూనాకు సంబంధించి  ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్, రేంజ్, ధరకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అయితే, ఈ మోపెడ్ ఒక్క ఫుల్ ఛార్జ్ తో 50-60 కి.మీ ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికలను అందిస్తారా? అనేది కూడా తెలియాల్సి ఉంది.   

ఇ- లూనా గతంలో మాదిరిగానే సత్తా చాటేనా?

50 సంవత్సరాల క్రితం లూనా లాంచ్ అయినప్పుడు మంచి ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం దాని ధర. అప్పట్లో సరికొత్త లూనా ధర దాదాపు రూ.2,000 ఉండేది. ఆ సమయంలో మోపెడ్‌ల విషయానికి వస్తే కైనెటిక్ 95 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. కైనెటిక్ లూనాను నిలిపివేయడానికి ముందు భారతదేశంలో దాదాపు 10 మిలియన్ యూనిట్లను విక్రయించింది. లూనా మాదిరిగానే, కైనెటిక్ గ్రీన్ కొత్త ఎలక్ట్రిక్ లూనాకు పోటీగా ధర నిర్ణయిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, దేశంలో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారులు ఉన్నారు. కానీ వాటిలో ఏవీ భారతీయ మార్కెట్లో మోపెడ్ వంటి ఉత్పత్తిని అందించడం లేదు. రాబోయే ఎలక్ట్రిక్ లూనా  ఒకప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న లూనా స్కూటర్‌ను పోలి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: అదిరిపో ఫీచర్లు, సూపర్ స్టైలిష్ లుక్, టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!