BJP on Rahul Gandhi: 


అనురాగ్ ఠాకూర్ విమర్శలు..


అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సెటైర్లు వేయడంపై బీజేపీ నేతలు మండి పడుతున్నారు. విదేశాల్లో భారత్ గురించి తక్కువ చేసి మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో లండన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలే పెద్ద దుమారం రేపాయి. కేంద్రమంత్రులంతా వరుస పెట్టి కౌంటర్‌లు ఇచ్చారు. ఇప్పుడు కూడా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. విదేశీ పర్యటనల్లో భారత్‌ని కించపరిచి మాట్లాడే వైఖరి ఇంకా మారలేదని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ "భారత్‌ని" ఓ దేశంలా పరిగణించడం లేదని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రెడిబిలిటీ సంపాదించుకున్న భారత్‌ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేందుకే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీని చూసి కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని అన్నారు. 


"కాంగ్రెస్‌కి భారత్ ఓ దేశంలానే కనిపించడం లేదేమో. పదేపదే విదేశాల్లో ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఆయన వైఖరి ఏమీ మారలేదు. 80ల్లో మన దేశంలో దళితులకు, వెనకబడిన వర్గాలకు ఎలాంటి న్యాయమూ జరగలేదు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని ఏలింది. ప్రజల్ని బానిసలుగా భావించింది. కానీ...మేం అందుకు భిన్నంగా ప్రజలంతా గర్వపడేలా పరిపాలన కొనసాగిస్తున్నాం. రాహుల్ మాత్రం విదేశాలకు వెళ్లి భారతీయులను, భారత దేశాన్ని అవమానిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రధాని నరేంద్ర మోదీ 24 మంది ప్రధాన మంత్రులను కలిశారు. అధ్యక్షులతో భేటీ అయ్యారు. 50 సార్లు కీలక సమావేశాలు నిర్వహించారు. ఆస్ట్రేలియా ప్రధాని మోదీని బాస్ అని సంబోధించారు. రాహుల్ గాంధీ ఇది తట్టుకోలేకపోతున్నారు"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి 






రాహుల్ కామెంట్స్‌పై మరో బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ఫైర్ అయ్యారు. భారత్ ప్రజాస్వామ్య దేశం కాకపోయుంటే..రాహుల్ విదేశాలకు వెళ్లి సొంత దేశంపై విమర్శలు చేసే అవకాశం ఉండేదా అని ప్రశ్నించారు. "భారత్‌లో ప్రజాస్వామ్యం లేకపోయుంటే..ఏ నేత అయినా విదేశాలకు వెళ్లేవాడా..? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై అలాంటి విమర్శలు చేయలగరా" అని మండి పడ్డారు.