NPS Retirement Benefits: పదవీ విరమణ తర్వాతి సమయం కోసం ముందు నుంచే ప్లాన్ చేయడం ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో అతి కీలకం. ముఖ్యంగా, మీరు ప్రైవేట్ సెక్టార్‌లో పని చేస్తుంటే, పదవీ విరమణ తర్వాత టెన్షన్ లేని జీవితం కోసం పర్‌ఫెక్ట్ ప్లానింగ్ చాలా ముఖ్యం. ఇందుకోసం 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' (NPS) చాలా ఉపయోగపడుతుంది. దీంతో, మీ రిటైర్మెంట్ నాటికి రూ. 2 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు కార్పస్ క్రియేట్ చేయవచ్చు.
ఈ స్కీమ్‌లో డబ్బు పెడితే, ఉద్యోగ కాలంలో మీకు ఆదాయపు పన్ను కూడా ఆదా అవుతుంది. ఉద్యోగం తర్వాత ఈ పథకం నుంచి ప్రతి నెలా మంచి అమౌంట్ లేదా నిర్ణీత మొత్తానికి హామీ లభిస్తుంది. సరిగ్గా ప్లాన్ చేస్తే ప్రతి నెలా రూ. 50 వేల వరకు పెన్షన్ తీసుకోవచ్చు.
పెన్షన్ ఫండ్ మేనేజర్లకు నమ్మకమైన ఆప్షన్
NPS రాబడి లెక్కలు ఆకట్టుకునేలా ఉంటున్నాయి. దాదాపుగా, ప్రతి పెన్షన్ ఫండ్ మేనేజర్ 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' కింద ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి కారణం ఇదే. ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఎక్కువ మంది ఫండ్ మేనేజర్లు రెండంకెల రాబడి, అంటే 10% కంటే ఎక్కువ రాబడిని సాధించారు. NPS ట్రస్ట్ వెబ్‌సైట్‌లోని NPS స్కీమ్-E (టైర్-1) డేటా దీనిని ధృవీకరిస్తోంది.
గణాంకాల ప్రకారం... మే 15, 2009న ప్రారంభమైనప్పటి నుంచి, SBI పెన్షన్ ఫండ్ 10.43 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. 1 ఆగస్టు 2013న ప్రారంభమైన HDFC పెన్షన్ ఫండ్ అత్యధికంగా 14.14 శాతం తిరిగి ఇచ్చింది. LIC పెన్షన్ ఫండ్ ఇప్పటి వరకు 12.24% రాబడిని ఇచ్చింది. ఇతర ఫండ్‌లను పరిశీలిస్తే, UTI SRL, ICICI పెన్షన్ ఫండ్, కోటక్ పెన్షన్ ఫండ్, బిర్లా పెన్షన్ ఫండ్ కూడా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కటి 11% కంటే ఎక్కువే రిటర్న్ ఇచ్చాయి.
రిటైర్మెంట్ తర్వాత చేతిలోకి దాదాపు ₹6 కోట్లు
NPS చందాదార్లు అద్భుతమైన రాబడి పొందారని గత 10-12 సంవత్సరాల గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఉదాహరణకు, మీరు ఇందులో సగటున 10% రాబడి పొందుతారని అనుకుందాం. ప్రతి నెలా రూ.5 వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 35 ఏళ్లలో రూ.1.89 కోట్ల ఫండ్ క్రియేట్ చేయవచ్చు. 30 ఏళ్లలో రూ.1.13 కోట్లు, 25 ఏళ్లలో రూ. 66 లక్షలను సృష్టించవచ్చు. ప్రతి నెలా రూ.10 వేలు పెట్టుబడి పెడితే 35 ఏళ్లలో రూ.3.8 కోట్లు, 30 ఏళ్లలో రూ. 2.26 కోట్లు రాబట్టవచ్చు. నెలవారీ పెట్టుబడిని రూ. 15,000కి పెంచితే, 35 ఏళ్లలో రూ. 5.69 కోట్ల నిధిని సృష్టించవచ్చు.
₹50 వేల పెన్షన్ ఫార్ములా
ఇప్పుడు నెలవారీ పెన్షన్ లెక్క చూద్దాం. జాతీయ పింఛను పథకాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా చూడాలి. దీనిలో, ఉద్యోగ సమయంలోనే క్రమపద్ధతిలో డబ్బును డిపాజిట్ చేస్తారు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో జమ చేసిన డబ్బును ఉద్యోగ విరమణ తర్వాత రెండు విధాలుగా పొందుతారు. రిటైర్మెంట్ టైమ్‌కు క్రియేట్ అయిన ఫండ్‌లో కొంత భాగాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు, మిగిలిన భాగాన్ని పెన్షన్ రూపంలో తీసుకోవచ్చు. ఈ రెండో భాగం నుంచి యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేస్తారు. యాన్యుటీలను కొనడానికి మీరు ఎంత ఎక్కువ డబ్బును కేటాయిస్తే, రిటైర్ అయిన తర్వాత అంత ఎక్కువ డబ్బు పెన్షన్‌గా లభిస్తుంది.
NPS టైర్-1 అకౌంట్‌ను పదవీ విరమణ ప్రయోజనాల కోసమే డిజైన్ చేశారు. ఇందులో కనీసం రూ.500 డిపాజిట్ చేసి ఖాతా తెరవవచ్చు. పదవీ విరమణ తర్వాత, అప్పటి వరకు డిపాజిట్ చేసిన మొత్తంలో ఒకేసారి 60% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం మొత్తం నుంచి యాన్యుటీస్ కొనుగోలు చేస్తారు. ప్రతి నెలా రూ.50 వేల పెన్షన్ పొందడానికి, కనీసం 2.5 కోట్ల రూపాయల ఫండ్ సిద్ధం చేయాలి. పదవీ విరమణ తర్వాత, అందులో 60% అంటే రూ. 1.5 కోట్లు ఒకేసారి విత్‌డ్రా చేస్తారు. మిగిలిన కోటి రూపాయల నుంచి యాన్యుటీస్ కొనుగోలు జరుగుతుంది. వార్షిక వడ్డీ రేటును 6%గా లెక్కిస్తే, ప్రతి నెలా 50 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది.
రెండు విధాలా ఆదాయ పన్ను ప్రయోజనం
NPS టైర్-1 అకౌంట్‌లో డిపాజిట్ చేసే డబ్బు, విత్ డ్రా చేసే డబ్బు రెండింటిపై టాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. NPS టైర్-1 ఖాతా కాంట్రిబ్యూషన్ విషయంలో, ఆదాయ పన్ను చట్టం 80C కింద రూ. 1.5 లక్షల వరకు & 80CCD (1B) కింద రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు. NPS టైర్-1 అకౌంట్ నుంచి విత్‌డ్రా చేయబడిన డబ్బు మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, యాన్యుటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని మీ మొత్తం ఆదాయంలో కలిపి, స్లాబ్ రేట్ ప్రకారం టాక్స్ కట్టాల్సి ఉంటుంది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: ₹50 లక్షల లోన్ మీద ₹12 లక్షలు మిగుల్చుకోవచ్చు, రోజుకు ₹100 దాస్తే చాలు!