2 Years Warranty On Kia Certified Pre-Owned Cars: భారతదేశంలో, 100వ 'కియా సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్' (Kia CPO) అవుట్‌లెట్‌ను కియా ఇండియా ప్రారంభించింది & కంపెనీ చరిత్రలో ఒక ప్రధాన మైలురాయిని చేరింది. కేవలం మూడు సంవత్సరాల లోపులోనే ఈ ఫీట్‌ సాధించడం ద్వారా, భారతదేశంలో ప్రీ-ఓన్డ్ కార్ల నెట్‌వర్క్‌ను నిర్మించే అత్యంత వేగవంతమైన కంపెనీలలో ఒకటిగా కియా నిలిచింది.       

Continues below advertisement


కియా సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై 2 సంవత్సరాల వారంటీ
కియా ఇండియా, తన సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ (Certified Pre-Owned - CPO) వాహనాలపై 2 సంవత్సరాలు లేదా 40,000 కి.మీ వారంటీని వినియోగదారులకు అందించడం ప్రారంభించింది. ఇంకా.. ఈ కంపెనీ, 4 ఉచిత సేవలను (పీరియాడిక్‌ మెయిన్టెనెన్స్‌) కూడా అందిస్తోంది. ఈ కొత్త సౌకర్యం కారణంగా, కియా చేపట్టిన ఈ కార్యక్రమంతో, ఇప్పుడు, భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన 'యూజ్డ్ కార్ ప్రోగ్రామ్‌'లలో ఒకటిగా మారింది.        


కియా CPO కార్ల నెట్‌వర్క్ ప్రస్తుతం భారతదేశంలోని 70 కి పైగా నగరాలకు విస్తరించింది & కంపెనీ మొత్తం రిటైల్ నెట్‌వర్క్‌లో దాదాపు 60% వాటాను కలిగి ఉంది. భారతీయ కస్టమర్లు ఇప్పుడు అధిక-నాణ్యమైన సర్టిఫైడ్ యూజ్డ్‌ కార్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని ఈ ట్రెండ్‌ స్పష్టంగా చూపిస్తోంది.


కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ ప్రకటన
"కేవలం 3 సంవత్సరాలలో భారతదేశంలో 100 CPO అవుట్‌లెట్‌లను చేరుకోవడం మా బ్రాండ్‌పై కస్టమర్‌లు కలిగి ఉన్న నమ్మకానికి నిదర్శనం. మా CPO వ్యాపారం.. నాణ్యత, సేవ & నమ్మకంతో నడిచే వ్యూహాత్మక వృద్ధి చోదకంగా మారింది" అని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ శ్రీ జున్సు చో అన్నారు. కంపెనీ, తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ & డిజైన్-ఫార్వర్డ్ అవుట్‌లెట్‌ల ద్వారా ప్రీ-ఓన్డ్ విభాగానికి కొత్త అర్ధం చెబుతోందని చెప్పారు.


నాణ్యత తనిఖీ తర్వాతే సర్టిఫైడ్‌ కారు అందుబాటులోకి!
కియా, తాను సర్టిఫై చేసిన యూజ్డ్‌ కార్లను (Kia Certified Used Cars) మార్కెట్లోకి ప్రవేశపెట్టే ముందు కఠినమైన 175-పాయింట్ల పరీక్ష ప్రక్రియ చేపడుతుంది. 1,00,000 కి.మీ. కంటే తక్కువ దూరం తిరిగిన, నిర్మాణ పరంగా నష్టం లేని, కియా ఒరిజినల్‌ విడిభాగాలతో రిపేర్‌ చేసిన, యాజమాన్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేని & అప్పటి వరకు చేయించిన సర్వీస్‌కు సంబంధించి అన్ని రికార్డులు కలిగిన కార్లను మాత్రమే కియా ధృవీకరిస్తుంది & అమ్మకానికి తీసుకొస్తుంది.
 
కియా కార్ల అమ్మకాలకే పరిమితం కాదు
కియా CPO అవుట్‌లెట్‌లు, సెకండ్‌ హ్యాండ్‌ కియా కార్ల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాదు. కస్టమర్లు ఇక్కడ ఏ బ్రాండ్ కారును అయినా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు లేదా మార్పిడి (ఎక్సేంజ్‌) చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా జరుగుతుంది, ఫలితంగా కంపెనీ సమయం - కస్టమర్‌ సమయం & కాగితపు పని ఆదా అవుతుంది.