World Car Of The Year Award won by Kia EV3: కార్ కొనాలనుకునే వాళ్లు ముందుగానే కొన్ని వివరాలు సేకరిస్తారు. మార్కెట్ నాడి ఎలా ఉంది, ఏ బ్రాండ్‌లో ఏ మోడల్ కార్ బెస్ట్, అది వాళ్ల అవసరాలకు సూట్ అవుతుందా, లేదా పరిశోధిస్తారు. అన్ని విధాలా సంతృప్తి చెందిన తర్వాత ఒక కార్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పటికే కార్ కొని, ఆటో సెక్టార్ మీద అభిరుచి ఉన్నవాళ్లు కూడా ఏయే కార్లలో ఎలాంటి లేటెస్ట్ అప్‌డేట్స్ వస్తున్నాయో తెలుసుకుంటుంటారు. ఉన్నవాటిలో బెస్ట్ కార్ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా కొన్ని ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ కూడా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నాయి. ఇంత రీసెర్చ్ చేసే టైమ్ మీకు లేకపోతే, ఏటా జాతీయంగా & అంతర్జాతీయంగా జరిగే 'ఆటో ఎక్స్‌పో'లలోనూ బెస్ట్ కార్‌ను ఎంపిక చేస్తారు, ఆ కార్ కొంటే సరిపోతుంది.
"న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షో 2025"లో కియా EV3 "వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు"ను అందుకుంది. ఇది ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (Sport Utility Vehicle - SUV). ఈ కియా కారు, బుధవారం (16 ఏప్రిల్ 2025) నాడు జరిగిన మోటార్ షోలో ప్రపంచంలోనే అత్యుత్తమ కారుగా నిలిచింది. కియా EV3తో పాటు, BMW X3 & హ్యుందాయ్ ఇన్‌స్టర్ (Hyundai Inster) కూడా ఈ ఆటో షో 2025 ఫైనల్స్‌లో నిలిచాయి.
వరుసగా రెండో అవార్డు గెలుచుకున్న కియా
గత సంవత్సరం కూడా, ఇంటర్నేషనల్ మోటార్ షో 2024లో, కియా EV9 (Kia EV9) "వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్" టైటిల్ సొంతం చేసుకుంది. ఇది కూడా ఎలక్ట్రిక్ SUV మోడల్ కార్. ఫోర్ వీల్ డ్రైవ్, 5 డోర్లు, 7 సీట్లు, లగ్జరీ ఫీచర్లతో స్టైలిష్ లుక్‌తో కనిపించే ప్రీమియం కార్ ఇది. ధర దాదాపు రూ. 1.30 కోట్ల (ex-showroom price) నుంచి ప్రారంభం అవుతుంది. మెర్సిడెస్ EQE SUV & BMW iX వంటి జర్మన్ లగ్జరీ EVలకు ప్రత్యామ్నాయంగా EV9ను కియా మార్కెట్ చేసింది. ఈ సంవత్సరం (2025) కూడా, కియా EV3 "వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్" గ్లోబల్ అవార్డ్‌ను అందుకోవడంతో వరుసగా రెండోసారి ప్రపంచవ్యాప్తంగా తన పేరును చాటుకుంది.
కియా EV9 కంటే ముందు, 2020 సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఆటో షోలో, ఈ దక్షిణ కొరియా కంపెనీకి (కియా) చెందిన టెల్యూరైడ్ (Kia Telluride) కార్ కూడా ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకుంది. కియా టెల్యూరైడ్‌ను 2020 మోడల్‌తో 2019 నుంచి ఉత్పత్తి చేస్తున్నారు.
ప్రపంచంలో అత్యుత్తమ కారును ఎలా ఎంపిక చేస్తారు?
వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులో, మొదట చూసే అర్హత - అమ్మకాలు. ఎంపిక చేసిన కారు ఒక సంవత్సరంలో కనీసం 10,000 యూనిట్లు అమ్ముడై ఉండాలి. రెండో అర్హత - ఆ కారు ప్రపంచంలోని కనీసం రెండు ప్రధాన కార్ల మార్కెట్లలో ఉనికి చాటుకోవాలి. అంటే.. భారత్, చైనా, యూరప్, జపాన్, కొరియా, లాటిన్ అమెరికా & యునైటెడ్ స్టేట్స్‌లో కనీసం రెండు మార్కెట్‌లో ఈ కార్ అమ్మకాలు జరగాలి. మూడో అర్హత - ఈ కార్ ధర ప్రైవేట్ మార్కెట్‌లోని లగ్జరీ కార్ల కంటే తక్కువగా ఉండాలి.
కియా EV3 కార్‌ను భారతదేశంలో కొనవచ్చా?
శక్తివంతమైన ఎలక్ట్రిక్ SUV అయిన కియా EV3 కారు ఇంకా భారత మార్కెట్లోకి విడుదల కాలేదు. కానీ ఈ కారు మరో రెండు నెలల్లో, అంటే, ఈ ఏడాది జూన్‌లో భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చు. కియా EV3 ఎలక్ట్రిక్ కారు ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఉండవచ్చు.