Ban On Ola, Uber And Rapido Bike Taxis In Karnataka: ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి సంస్థలకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court)లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బైక్ టాక్సీ సేవలను నిలిపివేసే నిర్ణయంపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కోర్టు నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం ఈ రోజు (2025 జూన్ 16, సోమవారం) నుంచే ప్రారంభమైంది. ఓలా, ఉబర్ & ర్యాపిడో వంటి కంపెనీల బైక్ టాక్సీ సేవలు కర్ణాటక రాష్ట్రంలో పూర్తిగా నిలిచిపోతాయి. కర్ణాటక ప్రభుత్వం నియమాలు & మార్గదర్శకాలను నిర్ణయించే వరకు బైక్ టాక్సీలను నడపడం చట్టవిరుద్ధం అని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

Continues below advertisement


అసలు విషయం ఏమిటి?
బైక్ టాక్సీలను చట్టబద్ధంగా గుర్తించాలని, పసుపు నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను రవాణా వాహనాలుగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబర్ ఇండియా, ర్యాపిడో సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ, ఈ కంపెనీలు మధ్యంతర ఉపశమనం కోసం దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. స్పష్టమైన నియమాలు లేకుండా బైక్ టాక్సీ సర్వీసులను చట్టబద్ధంగా పరిగణించలేమని జస్టిస్ బి.ఎం. శ్యామ్ ప్రసాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద బైక్ టాక్సీలకు మార్గదర్శకాలను రూపొందించడానికి ప్రభుత్వానికి కోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది.


మొదట ఏం జరిగింది?
జూన్ 15 వరకు బైక్ టాక్సీలు నడపడానికి ఆయా కంపెనీలకు అనుమతిని ఇస్తూ, కోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు, ఆ ఉపశమనం పొడిగించడానికి నిరాకరించింది. అంటే, కర్ణాటకలో ఈ రోజు నుంచి బైక్‌ టాక్సీ సర్వీసులు ఆగిపోతాయి.


ఎలక్ట్రిక్ బైక్ పథకం కూడా ఆగింది
కర్ణాటక ప్రభుత్వం 2021లో ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ పథకాన్ని ప్రారంభించింది. కానీ.. భద్రత & నిబంధనల్లో ఇబ్బందుల కారణంగా ఆ పథకాన్ని మార్చి 2024లో నిలిపివేసింది.


బెంగళూరు సహా సిటీ ప్రయాణికులకు పెద్ద షాక్
బెంగళూరు వంటి ట్రాఫిక్ రద్దీగా ఉండే నగరంలో బైక్ టాక్సీలు ప్రయాణీకులకు, ముఖ్యంగా ఉద్యోగులకు ఉపశమనం కలిగిస్తాయి. ఇప్పుడు, బైక్‌ టాక్సీలపై నిషేధం కారణంగా ప్రయాణీకులు టాక్సీలు & ఆటోలను ఆశ్రయించాల్సి ఉంటుంది, ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు & విద్యార్థులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.


డ్రైవర్ల ఆదాయాలపైనా ప్రభావం
బైక్‌ టాక్సీ సర్వీసుల ద్వారా జీవనోపాధి పొందుతున్న వేలాది మంది గిగ్‌ వర్కర్లు ఇప్పుడు నిరుద్యోగ ప్రమాదంలో పడ్డారు. చాలా మంది డ్రైవర్లు అప్పు చేసి బైక్‌లు కొనుగోలు చేశారు, ఇప్పుడు EMI చెల్లించడం కష్టం కావచ్చు. రాబోయే మూడు నెలల్లో బైక్ టాక్సీల కోసం కర్ణాటక ప్రభుత్వం స్పష్టమైన నియమ నిబంధనలను రూపొందించాల్సి ఉంటుంది. ఇది జరిగితేనే, భవిష్యత్తులో ఈ సేవలను తిరిగి పొందడం సాధ్యమవుతుంది. అప్పటి వరకు బైక్‌ టాక్సీ సేవలు అందించే వ్యక్తులు సంపాదన కోల్పోతారు & ప్రయాణీకులు కూడా ఇబ్బంది పడతారు.