Lufthansa Boeing 787-9 Dreamliner : జర్మనీకి చెందిన ప్రముఖ విమాన సంస్థ లుఫ్తాన్సా  బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం హైదరాబాద్‌కు బయల్దేరిన కొద్దిసేపటికే తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లో ల్యాండ్ అయింది. ఈ విమానం 15జూన్ 2025న ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన తర్వాత భారత్‌లో ల్యాండింగ్‌కు పర్మిషన్ లేదని తేలింది. అందుకే మళ్లీ విమానం వెనక్కి వెళ్లిపోయింది.  

లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానం (ఫ్లైట్ నంబర్ LH754) 15 జూన్ 2025న ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. మధ్యాహ్నం 2:14 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి టేకాఫ్ అయింది. అలా టేకాఫ్ అయిన కాసేపటికే ఆ విమానానికి భారత్‌లో "ల్యాండ్ అవ్వడానికి అనుమతి" లేదని తేలింది. దీంతో మార్గ మధ్యలో తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.

ఆదివారం మధ్యాహ్నం ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి బయల్దేరిన  LH752 విమానం సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సి ఉంది. అయితే, విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్‌లు ఈ విమానం జర్మనీలోనే ఉందని చూపిస్తున్నాయి. టేకాఫ్ అయిన కాసేపటికే మళ్లీ తిరిగి ఫ్రాంక్‌ఫర్డ్‌ చేరుకున్నట్టు చెబుతున్నాయి. 

ఈ గందరగోళంపై ఓ ప్రయాణికులు పీటీఐతో మాట్లాడుతూ... విమానం మళ్లీ ఫ్రాంక్‌ఫర్డ్‌ వెళ్తుందని విమాన సిబ్బంది చెప్పినట్టు తెలిపారు. రాత్రికి అక్కడ బస చేస్తున్నట్టు వెల్లడించారు. "మేము దాదాపు 15 నిమిషాల క్రితం ఫ్రాంక్‌ఫర్ట్‌లో తిరిగి వచ్చాము. హైదరాబాద్ విమానం ల్యాండ్ అవ్వడానికి అనుమతి ఇవ్వలేదని మాత్రమే చెప్పారు. " అని అమెరికా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రయాణికులు పీటీఐకి తెలిపారు. 

"అప్పటి వరకు ప్రయాణం సాఫీగా సాగింది. కానీ బయల్దేరిన రెండు గంటల తర్వాత తిరిగి వెనక్కి వెళ్తున్నట్టు చెప్పారు. ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు అదే విమానంలో బయలుదేరుతామని చెప్పారు" అని వివరించారు.  

ఏం జరిగిందో తెలుసుకునేందుకు పీటీఐ ఏజెన్సీ లుఫ్తాన్సా విమానాశ్రయ అధికారులను సంప్రదించింది. అయితే విమానం తిరిగి సేఫ్‌గా ల్యాండ్ అయినట్టు చెప్పారు. కానీ మిగతా వివరాలపై నోరు మెదపలేదు. "విమానం ఫ్రాంక్‌ఫర్ట్‌కు తిరిగి వచ్చిందని మేము నిర్ధారించగలము. మరిన్ని వివరాల కోసం, దయచేసి విమానయాన సంస్థను లేదా ఫెడరల్ పోలీసులను సంప్రదించండి" అని ఆ ప్రతినిధి PTIకి వివరించారు. 

స్థానికంగా ఉన్న  లైవ్ ఫ్లైట్ ట్రాకర్ మాత్రం LH752 సాయంత్రం 5:30 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్‌లో తిరిగి ల్యాండ్ అయినట్లు చెబుతోంది. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానంగా ధ్రువీకరిస్తున్నారు. విమాన ట్రాకింగ్ సైట్ FlightAware కూడా విమానం బయల్దేరిందని తిరిగి విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్టు చూపిస్తోంది. బయల్దేరిన విమానం రెండు గంటల తర్వాత ఎందుకు తిరిగి లుఫ్తాన్సా చేరుకుందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రయాణికులు మాత్రం భారత్‌లో ల్యాండ్ చేసేందుకు అనుమతి లేదని చెప్పారని అంటున్నారు.