ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హింట్ ఇచ్చారు. జూన్ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు సంబంధించి సోమవారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ (Telangana Cabinet Meeting) సమావేశంలో చర్చించిన అనంతరం స్పష్టత వస్తుందన్నారు.
కూసుమంచిలోనీ క్యాంప్ ఆఫీసులో పలు ప్రాంతాల నేతలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడుతూ.. మొదటగా జడ్పిటిసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి అన్నారు. తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మరో రెండు వారాలే గడువు ఉందని, కాంగ్రెస్ శ్రేణులు గుర్తిస్తాయిలో సిద్ధం కావాలని సూచించారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను పార్టీ ఎంపిక చేస్తుందన్నారు. ఎక్కడైనా చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అనేక కాంగ్రెస్ నేతలదే నని స్పష్టం చేశారు. వర్షాకాలం మొదలైందని, వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని తెలిపారు. సన్నాలకు బోనస్ రూ.500 సైతం త్వరలో అన్నదాతల ఖాతాల్లో జమ అవుతాయన్నారు.
బీసీ రిజర్వేషన్ లేకుండానే స్థానిక ఎన్నికలా?: శ్రీనివాస్ గౌడ్కుల గణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడింది డ్రామాలేనని బీఆర్ఎస్ మండిపడుతోంది. బీసీ రిజర్వేషన్లపై తేల్చకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్ర మంత్రులు ప్రకటించడం బీసీలకు చేస్తున్న అన్యాయమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రానికి బిల్లులు పంపి, చేతులు దులుపుకోవడం కాదు, బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రాధాన్యత లేని పదవులు బీసీలకు కట్టబెడుతున్నారని, కులగణన లెక్కలతో ప్రయోజనం ఏముందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
కాగా, రెండు రోజుల కిందట తెలంగాణ మంత్రి సీతక్క స్థానిక ఎన్నికల షెడ్యూల్ వారంలో వస్తుందని వ్యాఖ్యానించారని ప్రచారం జరిగింది. అయితే తాను వారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పలేదని, త్వరలో ఎన్నికలు వస్తాయని మాత్రమే చెప్పినట్లు తెలిపారు. తాను చేసినట్లు స్థానిక ఎన్నికల షెడ్యూల్ పై జరిగిన ప్రచారాన్ని ఖండించారు. స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పక్షాలు సిద్ధంగా ఉండాలని, త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుందని సీతక్క అన్నారు. ఈ నెలాఖరులో స్థానిక ఎన్నికల షెడ్యూల్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు అమలు కోసం కుల గణన చేశామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, హడావుడిగా ఎన్నికలకు ఎందుకు వెళ్తుందని బీఆర్ఎస్ నిలదీస్తోంది.