Telangana BASS: తెలంగాణలో చాలా కాలంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అమలు అవుతోంది. ఈ పథకంలో ప్రైవేట్ స్కూల్స్ కొన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు సీట్లు ఇవ్వాలి. ఆ విద్యార్థులకు సంబంధించిన టూషన్ ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా వెనకుబడిన వర్గాలకు ఈ బాస్ పథకం వర్తిస్తుంది. అయితే ఈ పథకాన్ని అమలు చేస్తున్నా తమకు ప్రభుత్వం నుంచి ట్యూషన్ ఫీజు రావడం లేదని వాపోతున్నాయి ప్రైవేటు పాఠశాలలు. దీని వల్ల ఆర్థికంగా చితికిపోతున్నామని, స్కూల్స్ నడపలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. జూన్ 20 వరకు సమయం ఇచ్చాయి. ఆలోపు చెల్లించకుంటే స్కూల్స్ మూసివేయాల్సి ఉంటుందని చెబుతున్నాయి.
బాస్(Best Available Schools Scheme ) పథకం కింద ప్రభుత్వం 210 కోట్ల రూపాయలు తమకు చెల్లించాల్సి ఉందని ప్రైవేట్ స్కూల్స్ చెబుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 237 ప్రైవేటు స్కూల్స్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద ప్రతిభ ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేటు స్కూల్‌లో సీట్లు ఇస్తారు. వారికి సంబంధించిన ట్యూషన్ ఫీజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఇలా 25000 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూల్స్‌లో చదువుకుంటున్నారు.
ఒప్పందం ప్రకారం పేద విద్యార్థులను చదివించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వారి ట్యూషన్ ఫీజు చెల్లించడంలో విఫలమైందని ఆరోపిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్. ఏకంగా మూడు ఏళ్ల నుంచి ట్యూషన్ ఫీజు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఈ ఆలస్యంతో తమపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు వారి ఖర్చులకి కూడా సమస్యలు ఏర్పడుతున్నాయని స్కూల్స్ నడపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ప్రైవేటు ఫైనాన్సీయర్స్ వద్ద భారీ వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి స్కూల్స్ నడపాల్సి వస్తోందని ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. వాళ్లంతా ఇప్పుడు స్కూల్ మీదకు వస్తున్నారని సమాధానం చెప్పుకోలేపతున్నామని అంటున్నారు. ఆర్థిక కష్టాలతో స్కూల్ బస్‌ల ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు. కొన్ని బస్‌లు సీజ్ చేశారని తెలిపారు. అప్పులోళ్ల నుంచి తప్పించుకునేందుకు స్కూల్‌కు వెళ్లడమే మానేస్తున్నామని తప్పించుకొని తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
వెల్ఫేర్ హాస్టల్స్‌లో ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై లక్షన్నర ఖర్చు పెడుతుందన్నారు BASS స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ప్రధాన కార్యదర్శి యాగిరి శేఖర్‌రావు. డేస్కాలర్‌పై 50 ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. BASS కింద కేవలం హాస్టలర్స్‌కి 42000 రూపాయలు, డే స్కాలర్‌కు28000 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇంత చేస్తున్నా ఆర్థిక ఇబ్బందుల పేరుతో గత మూడేళ్ల నుంచి ఈ పథకం బకాయిలను ప్రభుత్వం విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపపోవడంతో ఈ బాస్ పథకం కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులను చేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. స్కూల్స్ ప్రారంభమై ఐదు రోజులు అయినా వారిని ఇంకా తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వం ఇంకా తాత్సారం చేస్తే తాము పూర్తిగా స్కూల్స్‌ను మూసివేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. 20వే తేదీలోపు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.