Honda Elevate Launch: హోండా తన సరికొత్త ఎస్‌యూవీ ఎలివేట్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీకి చెందిన రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో దీని ఉత్పత్తి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇది ఇప్పటికే మార్కెట్లో అద్భుతమైన స్పందనను పొందుతోంది. దీని వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. హోండా ఎలివేట్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 25,000 డౌన్‌పేమెంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు దీన్ని ఆన్‌లైన్‌లో లేదా హోండా డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 4న లాంచ్
హోండా ఎలివేట్ అధికారిక ధరలు సెప్టెంబర్ 4వ తేదీన లాంచ్ సందర్భంగా వెల్లడికానున్నాయి. అయితే, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఎస్‌వీ, వీ, వీఎక్స్, జెడ్ఎక్స్ అనే నాలుగు విభిన్న ట్రిమ్‌లలో హోండా ఎలివేట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ రెండింటితో సహా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.
హోండా ఎలివేట్ అడ్వాన్స్‌డ్ కంపాటిబిలిటీ ఇంజనీరింగ్ బాడీ ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది అధిక నాణ్యత గల స్టీల్‌తో తయారు అయినందున ఎక్కువ బలాన్ని అందిస్తుంది. దీని పొడవు 4,312 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1,790 మిల్లీమీటర్లు గానూ, ఎత్తు 1,650 మిల్లీమీటర్లు గానూ ఉంది. దీని వీల్‌బేస్ 2,650 మిల్లీమీటర్లుగా ఉండటం విశేషం. అలాగే ఇది 458 లీటర్ల భారీ బూట్ స్పేస్, ఆకర్షణీయమైన R17 అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.
ఫీచర్లు ఇలా?
ఎస్‌యూవీ వెలుపలి భాగంలో క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్స్, బాడీ క్లాడింగ్, వీల్ ఆర్చ్‌లు, సిల్వర్ ఫినిషింగ్‌తో కూడిన రూఫ్ రెయిల్‌లు వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు అందించారు. రియర్‌వ్యూ మిర్రర్‌లపై క్రోమ్ యాక్సెంట్‌లు, ఎల్ ఆకారపు టెయిల్ ల్యాంప్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. హోండా ఎలివేట్ అనేక ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్, మోనోటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డ్రైవర్ కోసం ఏడు అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అందించారు. ఇందులో సేఫ్టీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. టాప్ వేరియంట్‌లో ఏడీఏఎస్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ లభిస్తాయి.
హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 6,600 ఆర్‌పీఎమ్ వద్ద 119 హార్స్‌పవర్, 4,300 ఆర్‌పీఎమ్ వద్ద 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా CVT ఆటోమేటిక్ ఎంపికను పొందుతుంది. దీని మాన్యువల్ వేరియంట్ లీటరు పెట్రోలుకు సుమారు 15 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ 16 కిలోమీటర్ల మైలేజిని పొందుతుంది.
వేటితో పోటీ ఉంటుంది?
ఈ ఎస్‌యూవీ లాంచ్ కానున్న సెగ్మెంట్‌లో మార్కెట్‌లో చాలా పోటీ ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial