Paderu RTC Bus Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు లోయలో పడటంతో ఇద్దరు మృతిచెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం సూచించారు.


మెరుగైన వైద్యం అందించండి.. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు
పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. చోడవరం నుండి పాడేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు పాడేరు వ్యూ పాయింట్ వద్ద లోయిలో పడింది. ఈ ఘటన లో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, తీవ్రంగా గాయపడిన ప్రమాద బాధితులను విశాఖ తరలించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. గాయపడి న వారి లో చిన్నారులు మహిళలు ఉన్నారు వారికి వైద్య సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య అధికారులు కూడా సంఘటనా స్థలానికి వెళ్ళేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆమె తీవ్ర సంతాపం తెలిపారు 


పాడేరు ఘాట్ రోడ్డులో లోయలో పడిన ఆర్టీసీ బస్సు, ఇద్దరి మృతి 
పాడేరు: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాడేరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తోంది. ఈ క్రమంలో ఘాట్‌ రోడ్డు వ్యూ పాయింట్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 45 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. 


ప్రమాదం జరిగింది ఘాట్ రోడ్డులో, అందులోనూ లోయలో కావడంతో గాయపడిన వారికి సహాయం చేసేందుకు, వారిని కాపాడేందుకు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. స్థానికుల సహాయంతో గాయపడ్డ వారు రోడ్డు మీదకి చేరుకున్నారు. గాయపడిన వారిలో ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం  మరో ఆర్టీసీ బస్సులో క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన చోట సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం ప్రయాణికులను మరిన్ని ఇబ్బందులకు గురిచేసింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉంది.