APSRTC Bus Fell into Valley In Paderu:
పాడేరు: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాడేరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తోంది. ఈ క్రమంలో ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 45 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగింది ఘాట్ రోడ్డులో, అందులోనూ లోయలో కావడంతో గాయపడిన వారికి సహాయం చేసేందుకు, వారిని కాపాడేందుకు కొంచెం కష్టపడాల్సి వచ్చింది. స్థానికుల సహాయంతో గాయపడ్డ వారు రోడ్డు మీదకి చేరుకున్నారు. గాయపడిన వారిలో ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్ ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మరో ఆర్టీసీ బస్సులో క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన చోట సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం ప్రయాణికులను మరిన్ని ఇబ్బందులకు గురిచేసింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉంది.