Bike Comparison: భారతీయ మార్కెట్‌లో సబ్ 500 సీసీ విభాగంలో కొత్త మోటార్‌సైకిళ్లు నిరంతరం లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో తాజా మోడల్ హీరో మావెరిక్ (Hero Maverick). ఇది హార్లీ డేవిడ్‌సన్ ఎక్స్440 (Harley Davidson X440) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందిన రెట్రో రోడ్‌స్టర్ కావడం విశేషం. హీరో దాని ధరలను ప్రకటించనప్పటికీ ఎక్స్440తో సహా ఈ విభాగంలోని అనేక మోటార్‌సైకిళ్లకు మావెరిక్ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. కొత్త హీరో మావెరిక్ కేవలం రీబ్యాడ్జ్ చేసిన హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 బైక్‌నా అనే ప్రశ్న మీ మనస్సులో ఉండవచ్చు. ఈ రెండిటీ మధ్య ఉండే పోలికలు, తేడాలు చూద్దాం.


రెండు బైక్‌ల మధ్య తేడా ఏమిటి? (Hero Maverick Vs Harley Davidson X440)
ముందుగా ఈ రెండింటి మధ్య తేడా గురించి మాట్లాడుకుందాం. హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440తో పోలిస్తే మావెరిక్ డిజైన్ గురించి ఎక్కువగా మాట్లాడే అంశం ఇదే. వీటిలో ఎక్స్440 ఫ్యూయల్ ట్యాంక్, పెద్ద సైడ్ ప్యానెల్‌లతో సింపుల్, క్రూయిజర్ డిజైన్‌ను కలిగి ఉంది. హార్లే డేవిడ్‌సన్ కొంచెం పైకి వాలుగా ఉండే ఎగ్జాస్ట్‌ను కలిగి ఉంది. ఇంజిన్ ఎలిమెంట్స్, బాడీవర్క్ చాలా వరకు నలుపు రంగులో ఉన్నాయి.


హీరో మావెరిక్ రెండు వైపులా కౌల్స్‌తో కూడిన మస్కులర్ ట్యాంక్, రౌండ్ హెడ్‌ల్యాంప్, స్పోర్టీ గ్రాబ్ రైల్, టెయిల్ సెక్షన్‌లో ఇంటిగ్రేటెడ్ రియర్ లైట్, బలమైన సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్‌ను పొందుతుంది. మొత్తమ్మీద ఎక్స్440 క్రూయిజర్ డిజైన్‌తో పోలిస్తే మావెరిక్ స్పోర్టియర్ రోడ్‌స్టర్ అప్పీల్‌ని కలిగి ఉంది.


ఇతర తేడాల గురించి చెప్పాలంటే అల్లాయ్ వీల్ డిజైన్, వీల్ సైజు భిన్నంగా ఉంటాయి. ఎక్స్440లో 18 అంగుళాల ఫ్రంట్, 17 అంగుళాల రియర్ చక్రాలను పొందగా, మావెరిక్ ఫ్రంట్, రియర్ రెండు వైపులా 17 అంగుళాల చక్రాలను పొందుతుంది. స్పీడోమీటర్ కన్సోల్ కూడా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్440 రౌండ్ యూనిట్‌ను పొందుతుంది. అయితే మావెరిక్ వేరే షేప్‌ను పొందుతుంది. దీని సస్పెన్షన్ సెటప్ కూడా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే హార్లే యూఎస్‌డీ యూనిట్‌ను పొందుతుంది. మావెరిక్ సంప్రదాయ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను పొందింది.


రెండు బైక్‌ల మధ్య పోలికలు ఏమిటి? (Maverick Vs Davidson X440)
రెండింటి మధ్య ఉన్న సారూప్యత గురించి మాట్లాడుతూ హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440, హీరో మావెరిక్ ఒకే రకమైన ఛాసిస్, ఇంజిన్, గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ కూలర్‌తో కూడిన 400 సీసీ ఎయిర్ కూల్డ్ యూనిట్, మావెరిక్ ఇంజన్ 26 బీహెచ్‌పీ పవర్‌ని, 36 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అయితే ఎక్స్440 ఇంజిన్ మరింత శక్తిని, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు మోటార్‌సైకిళ్ల ఇంజన్‌లు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయ్యాయి. 


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!


Also Read: బైక్ నడిపేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవుతున్నారా? - అయితే సరిగ్గా నడుపుతున్నట్లే!