Dharmavaram MLA Kethireddy: ధర్మవరం: నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన భూ కుంభకోణాలు, భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (Gonuguntla Suryanarayana) డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ ను కలిసి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ధర్మవరం నియోజకవర్గంలో అధర్మం, అక్రమాలు అడ్డగోలుగా సాగుతున్నట్లు కలెక్టర్ కు ఆయన వివరించారు. నియోజకవర్గంలో ధర్మవరం (Dharmavaram) ఎమ్మెల్యే అరాచక పాలన సాగిస్తున్నారని, భూ కుంభకోణాలన్నీ ఆయన కనుసన్నలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. భూ అక్రమాలు, కుంభకోణాలు జరిగిన తీరును మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సమగ్ర వివరాలను కలెక్టర్ కు అందజేశారు.
ముదిగుబ్బ మండలంలో అక్రమ లేఅవుట్లు వేశారని ఆరోపణలు
నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో 122.82 ఎకరాలలో అక్రమ లేఅవుట్లు వేశారని కలెక్టర్ కు గోనుగుంట్ల వివరించారు. అలాగే బత్తలపల్లి మండలంలోని 92.10 ఎకరాల భూమిలో ఇదే తరహాలో అక్రమ లేఔట్లు వేసిన విషయాన్ని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చిగిచెర్ల, రేగాటిపల్లి సొసైటీ కి చెందిన 398.22 ఎకరాల భూమిని అనర్హులకు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఒక ఎమ్మార్వో, ఇద్దరు విఆర్వోలు, ఒక విఆర్ఏ, సస్పెండ్ అవడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ముదిగుబ్బ ఎమ్మార్వో సస్పెండ్ కూడా అయ్యారన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి, డి.ఎస్.పి రమాకాంత్ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిపారు. పోతుల నాగేపల్లి గ్రామంలోని అర్హులైన పేదల ఇంటి పట్టాలను రద్దుచేసి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన రౌడీలకు ఇంటి పట్టాలు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన గుప్పిట్లో పెట్టుకొని, చెప్పిన పని చేయకపోతే సస్పెండ్ చేయించడం, లేదా బదిలీల పేరుతో వేధించడం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగాలు న్యాయబద్ధంగా, సమర్థవంతంగా పాలన చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రైవేట్ సైన్యంతో భూ కబ్జాలు, దందా!
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ప్రైవేట్ సైన్యంతో భూ కబ్జాలు, ఇసుక దందా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియాలను పెంచి పోషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ పై దాడులు, పుట్టపర్తి లో పాత్రికేయుడి మీద దాడి చేసిన మాఫియా కు నగరం నడిబొడ్డులో ఉన్న ఇంటి పట్టాలు, నగదు పారితోషకాలు ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. అంతిమంగా ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి రౌడీ పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ కు వివరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్య దుర్మార్గాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.