Realme 12 Pro Plus 5G: రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లు భారతదేశంలో సోమవారం లాంచ్ అయ్యాయి. ఈ కొత్త స్మార్ట్ ఫోన్లు రియల్‌మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనున్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉన్నాయి. 67W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. రియల్‌మీ 12 ప్రో 5జీలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను, రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నారు. రెండు ఫోన్లలోనూ డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ ఉంది. దీని ద్వారా స్టోరేజ్ నుంచి కొంత మెమొరీని ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు.


రియల్‌మీ 12 ప్రో 5జీ ధర (Realme 12 Pro 5G Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.26,999గా నిర్ణయించారు. నేవిగేటర్ బీజ్, సబ్‌మెరైన్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ ధర (Realme 12 Pro Plus 5G Price in India)
ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందించారు. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.31,999గానూ, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గానూ ఉంది. నేవిగేటర్ బీజ్, సబ్‌మెరైన్ బ్లూ, ఎక్స్‌ప్లోరర్ రెడ్ కలర్ ఆప్షన్లలో రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ లాంచ్ అయింది.


రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ సిరీస్ సేల్ వివరాలు
ఈ రెండు ఫోన్లకు సంబంధించిన సేల్ ఫిబ్రవరి 6వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఎర్లీ యాక్సెస్ ఈరోజు (జనవరి 29వ తేదీ) ప్రారంభం అయింది.


రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు (Realme 12 Pro Plus 5G Specifications)
రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 స్కిన్‌పై పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 93 శాతంగానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 4 ఇన్ 1 పిక్సెల్ ఫ్యూజన్ టెక్నాలజీలు ఈ సెన్సార్‌లో ఉన్నాయి. దీంతోపాటు 64 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ64బీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా చూడవచ్చు. 120x డిజిటల్ జూమ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.


దీని స్టోరేజ్ సామర్థ్యం 256 జీబీగా ఉంది. 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ ఉన్న హై రిజల్యూషన్ డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ కూడా అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 67W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ టెక్నాలజీ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జింగ్ 48 నిమిషాల్లోనే ఎక్కనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 196 గ్రాములుగా ఉంది.


రియల్‌మీ 12 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (Realme 12 Pro 5G Features)
ఈ స్మార్ట్ ఫోన్‌ సిమ్, సాఫ్ట్ వేర్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, డిస్‌ప్లే ఫీచర్లు రియల్‌మీ 12 ప్రో ప్లస్ తరహాలోనే ఉన్నాయి. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.


రియల్‌మీ 12 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్709 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా చూడవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. 256 జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!