Citroën C3 Aircross Bookings: సిట్రోయెన్ ఎట్టకేలకు తన సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. రూ. 25,000 చెల్లించి ఈ కారును కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ మోడల్ లైనప్ యూ, ప్లస్, మ్యాక్స్ అనే మూడు విభిన్న ట్రిమ్‌లలో వస్తుంది. ఇది 5-సీటర్, 7-సీటర్ సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో లాంచ్ అయింది. అన్ని వేరియంట్లలోనూ ఒకే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఇది 109 బీహెచ్‌పీ శక్తిని, 190 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.


పోలార్ వైట్, ప్లాటినం గ్రే, స్టీల్ గ్రే, కాస్మో బ్లూ, పోలార్ వైట్ విత్ కాస్మో బ్లూ రూఫ్, స్టీల్ గ్రే విత్ కాస్మో బ్లూ రూఫ్, స్టీల్ గ్రే విత్ పోలార్ వైట్ రూఫ్ వంటి మల్టీపుల్ కలర్ ఆప్షన్‌లలో సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్‌ను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. కాస్మో బ్లూతో స్టీల్ గ్రే పోలార్ వైట్ రూఫ్, పోలార్ వైట్ రూఫ్‌తో ప్లాటినం గ్రే, ప్లాటినం గ్రే రూఫ్‌తో పోలార్ వైట్ బాడీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. సీఎంపీ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితం అయిన సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ పొడవు 4.3 మీటర్లు కాగా, 2,671 మిల్లీమీటర్ల వీల్‌బేస్ కలిగి ఉంది. ఇది క్రెటా కంటే చాలా పొడవుగా ఉంటుంది. ఈ కొత్త సిట్రోయెన్ ఎస్‌యూవీ డిజైన్, స్టైల్ సీ3 హ్యాచ్‌బ్యాక్‌ని పోలి ఉంటుంది.


డిజైన్ ఎలా ఉంది?
ముందు భాగంలో సిట్రోయెన్ మార్కు సిగ్నేచర్ గ్రిల్ ఉంది. ఇందులో డ్యూయల్ లేయర్ డిజైన్, పియానో బ్లాక్ ఇన్సర్ట్‌లు, హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన వై-ఆకారపు డీఆర్ఎల్స్, విస్తృత ఫ్రంట్ బంపర్, రౌండ్ ఫాగ్ ల్యాంప్ ఎన్‌క్లోజర్‌లతో కవర్ అయిన డెడికేటెడ్ బ్రష్డ్ అల్యూమినియం ఎయిర్ ఇన్‌టేక్ వెంట్ ఉన్నాయి. హై ఎండ్ వేరియంట్‌లు ఎక్స్ - ఆకారపు డిజైన్‌తో డ్యూయల్ టోన్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో స్క్వేర్ టెయిల్‌ల్యాంపులు, క్లాడింగ్‌తో కూడిన పొడవైన బంపర్, పెద్ద టెయిల్‌గేట్‌ను పొందుతాయి.


ఫీచర్లు ఇలా?
5 సీటర్ C3 ఎయిర్‌క్రాస్ 5+2 సీటింగ్ లేఅవుట్‌తో 444 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. ఇక 7-సీటర్ వెర్షన్ విషయానికి వస్తే... మూడో వరుసలో ఫోల్డబుల్  సీట్లను పొందుతుంది. 511 లీటర్ల కార్గో స్పేస్‌ను కలిగి ఉంది. దీని ముఖ్య ఫీచర్ల గురించి చెప్పాలంటే 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, లెథెరెట్ అప్హోల్స్టరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కీలెస్ ఎంట్రీ, డ్రైవర్ సీటు కోసం మాన్యువల్ హైట్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి. క్లైమెట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్ కూడా అందించారు. ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారాతో పోటీపడుతుంది. ప్రస్తుతం రూ.10 లక్షలలోపు బెస్ట్ కారు ఇదేనా అనే ప్రశ్న తలెత్తితే మాత్రం యూనిట్స్ మార్కెట్లోకి వచ్చి వినియోగదారులు ఉపయోగిస్తేనే కానీ చెప్పలేం.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial