కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం అన్ని రంగాల్లాగే ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ఎదురుచూస్తుంది. దేశవాళీ ఉత్పత్తి పెంచడానికి, కొత్త టెక్నాలజీలు తీసుకురావడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీలు కావాలంటే భవిష్యత్తులు పెట్టుబడులను ఆహ్వానించడం తప్పనిసరి. ఈ తరహా పెట్టుబడులకు ప్రభుత్వం ఏమైనా ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తుందేమో అని పరిశ్రమ ఎదురుచూస్తోంది.
గ్రాండ్ థోర్టన్ సర్వే ప్రకారం 84 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యక్ష పన్ను రాయితీలు, ఇన్సెంటివ్‌లు అందిస్తారని అంచనా వేస్తున్నారు. స్టార్టప్ కంపెనీలకు ఆర్థిక సాయం కావాలని 74 శాతం మంది, మెరుగైన ఆటోమోటివ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ బేస్ కావాలని 75 శాతం మంది కోరారు.
భారతీయ ఎకానమీలో ఆటోమోటివ్ సెక్టార్ ఎంతో కీలకమైనది. వ్యాపారం సులభతరం కావడానికి పరిశ్రమలు కూడా మెరుగవ్వాలని కోరుకోవడం సహజమే. గ్రాండ్ థోర్టన్ సర్వేలో ఆటోమొబైల్ రంగంలోని వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా 1,000 మందికి పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చిప్ షార్టేజ్ సమస్య నడుస్తుంది. కాబట్టి దేశంలోనే చిప్‌లు రూపొందించే సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వ సహకారం కావాలని 52 శాతం మంది కోరారు.అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వ సహకారం కావాలని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు.
కేంద్ర బడ్జెట్ అనంతరం వాహనాల ధర పెరిగే అవకాశం కూడా ఉందని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘దేశాన్ని తయారీ హబ్‌గా రూపొందించాలంటే.. వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, దీర్ఘకాల వ్యూహం కచ్చితంగా అవసరం అవుతాయి.’ అని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.
ఇండస్ట్రియల్ జీడీపీలో దాదాపు సగభాగం అందించే ఆటో మొబైల్ పరిశ్రమ కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటోందన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి కొత్త టెక్నాలజీల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి బడ్జెట్ ద్వారా కేంద్రం సాయం చేయాలని కోరారు.
ప్రభుత్వం ఆటోమొబైల్ ఇండస్ట్రీతో పాటు ఎలక్ట్రానిక్స్, ప్యాసింజర్ సేఫ్టీ సిస్టమ్స్‌పై కూడా దృష్టిపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆటోమోటివ్ సెక్టార్‌లో ఆశాజనక వ్యూహాలు కావాలని సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది కోరారు.