దిగ్గజ ఆటో కంపెనీ బీఎండబ్ల్యూ మనదేశంలో మొదటి స్కూటీని లాంచ్ చేసింది. అదే బీఎండబ్ల్యూ మ్యాక్సీ స్కూటర్ సీ400జీటీ. ఈ స్కూటర్ ధర మనదేశంలో రూ.9.95 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఆన్ రోడ్‌కు రూ.10 లక్షలు కూడా దాటేసే అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఆల్ఫైన్ వైట్, స్టైల్ ట్రిపుల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
బీఎండబ్ల్యూ మ్యాక్సీ స్కూటర్ సీ400జీటీ బాడీ ప్యానెల్ బలంగా ఉండనుంది. పొడవైన విండ్ స్క్రీన్, పుల్ బ్యాక్ హ్యాండిల్ బార్, పెద్ద సీట్లు, డ్యూయల్ ఫుట్ రెస్ట్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, కీలెస్ ఇగ్నీషన్, హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీట్లు, యాబ్స్, యాంటీ థెఫ్ట్ అలారం సిస్టం, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి.
ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 350 సీసీ వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్‌ను అందించారు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ కూడా ఇందులో ఉంది. 33.5 బీహెచ్‌పీ పవర్, 35 ఎన్ఎం టార్క్ కూడా ఇందులో ఉన్నాయి. దీని పవర్ ఫుల్ ఇంజిన్ కారణంగా.. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇది 9.5 సెకన్లలోనే అందుకోనుంది. దీని టాప్ స్పీడ్ 139 కిలోమీటర్లుగా ఉంది.
ధర విషయంలో బీఎండబ్ల్యూ మ్యాక్సీ స్కూటర్ సీ400జీటీకి ఎటువంటి పోటీ లేకపోయినా.. హోండా ఫోర్జా 350, సుజుకి బుర్గ్‌మన్ స్ట్రీట్ 125, ఏప్రిలా ఎస్ఎక్స్ఆర్ 160లతో ఇది పోటీ పడనుంది. అయితే హోండా తన స్కూటీని మనదేశంలో లాంచ్ చేస్తుందో లేదో తెలియరాలేదు.
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!