Best Selling Hatchbacks: 2024 ఫిబ్రవరికి సంబంధించిన కాంపాక్ట్, మిడ్‌సైజ్ హ్యాచ్‌బ్యాక్‌ల సేల్స్ నంబర్లు బయటకి వచ్చాయి. ఎప్పటిలాగే మారుతి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అంతే కాకుండా ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 6 మోడళ్లలో నాలుగు మారుతికి చెందినవే. మరోవైపు టాటా కూడా మెల్లగా తన మార్కెట్ వాటా పెంచుకుంటోంది. టాటా ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కూడా టాప్ 3 లిస్టులో చేరింది. అసలు ఈ లిస్టులో ఏ కార్లు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం.


మారుతి వ్యాగన్ఆర్ (Maruti WagonR)
2024 ఫిబ్రవరిలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా మారుతి వ్యాగన్ఆర్ తన స్థానాన్ని నిలుపుకుంది. గత నెలలో మారుతి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ 19,412 యూనిట్లు అమ్ముడుపోయాయి. అమ్మకాల్లో గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 15 శాతం, 2024 జనవరితో పోలిస్తే తొమ్మిది శాతం వృద్ధిని వ్యాగన్ఆర్ నమోదు చేయడం విశేషం.


మారుతి స్విఫ్ట్ (Maruti Swift)
మారుతి గత నెలలో 13,162 యూనిట్ల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించింది. 2024 ఫిబ్రవరిలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండో హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. దీని అమ్మకాలు 2023 ఫిబ్రవరితో పోలిస్తే 28 శాతం, 2024 జనవరితో పోలిస్తే 14 శాతం పడిపోయాయి.


టాటా టియాగో (Tata Tiago)
టాటా టియాగో గత నెలలో 6,947 యూనిట్ల విక్రయాలతో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను అధిగమించి లిస్టులో మూడో స్థానానికి చేరుకుంది. టాటా టియాగో నెలవారీ అమ్మకాలు ఏడు శాతం పెరిగాయి. అయితే దాని వార్షిక అమ్మకాలు 2023 ఫిబ్రవరి అమ్మకాలతో పోలిస్తే దాదాపు 500 యూనిట్లు తగ్గాయి. ఈ విక్రయాల్లో టాటా టియాగో ఈవీ విక్రయాలు కూడా కలిసి ఉన్నాయి. దాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.


హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 2024 ఫిబ్రవరిలో దాదాపు 4,947 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయింది. హ్యాచ్‌బ్యాక్ నెలవారీ అమ్మకాలు దాదాపు 2,000 యూనిట్ల క్షీణతను నమోదు చేశాయి. అదే సమయంలో 2023 ఫిబ్రవరితో పోల్చినా ఏకంగా 49 శాతం పడిపోయాయి.


మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
2024 ఫిబ్రవరిలో మారుతి సుజుకి సెలెరియో అమ్మకాలు కూడా తగ్గాయి. 2024 జనవరితో పోలిస్తే 19 శాతం, 2023 ఫిబ్రవరితో పోలిస్తే 20 శాతం అమ్మకాలు పడిపోయాయి. గత నెలలో మొత్తం అమ్మకాలు 3,586 యూనిట్లుగా ఉన్నాయి.


మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis)
2024 ఫిబ్రవరిలో 2,110 యూనిట్ల మొత్తం అమ్మకాలను నమోదు చేయడం ద్వారా మారుతి ఇగ్నిస్ ఈ జాబితాలో ఆరో స్థానాన్ని పొందింది. ఇగ్నిస్ నెలవారీ అమ్మకాలు 500 యూనిట్ల క్షీణతను నమోదు చేశాయి. అయితే దీని అమ్మకాలు కూడా 2023 ఫిబ్రవరితో పోలిస్తే దాదాపు 56 శాతం క్షీణించాయి.


మరోవైపు డీజిల్ వాహనాలు అనేక దశాబ్దాలుగా భారతీయ కార్ల కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. ఈ ఇంజన్లను వాటి టార్క్, పవర్, ఇంధన సామర్థ్యం కారణంగా ఎక్కువ మంది ఇష్టపడతారు. అంతే కాకుండా కఠినమైన ఎమిషన్ రూల్స్, 10 ఏళ్ల డీజిల్ కార్లపై నిషేధం, పెట్రోల్ మోటార్ల మెరుగైన మైలేజీ కారణంగా ప్రజల ప్రాధాన్యతలు కూడా మారుతున్నాయి. మారుతి సుజుకి, హోండా వంటి కంపెనీలు ఇప్పటికే డీజిల్ ఇంజిన్‌లను తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో నుంచి పూర్తిగా తొలగించాయి.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!