Aishwarya Rajinikanth about Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎందరో దర్శకులకు లైఫ్ ఇచ్చారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్న చాలామంది రజినీ సినిమాతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక తన కూతురు ఐశ్వర్యకు కూడా డైరెక్టర్‌గా అదే విధమైన సక్సెస్ దక్కాలని తనతో కలిసి ‘లాల్ సలామ్’ అనే చిత్రాన్ని చేశారు రజినీ. కానీ రజినీకాంత్ కెరీర్‌లో ఇలాంటి ఘోరమైన ఫ్లాప్ లేదు అనేంతలాగా ‘లాల్ సలామ్’ డిసాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఫెయిల్యూర్‌పై ఐశ్వర్య స్పందించారు. 21 రోజులు షూటింగ్ చేసిన ఫుటేజ్ మిస్ అయ్యిందంటూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. దాని వల్లే ‘లాల్ సలామ్’పై తీవ్రమైన ఎఫెక్ట్ పడిందని చెప్పుకొచ్చారు.


మొయిద్దీన్ భాయ్‌‌గా రజినీకాంత్..


మతపరమైన హింసల కథ ఆధారంగా ‘లాల్ సలామ్’ సినిమా తెరకెక్కింది. ఐశ్వర్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజినీకాంత్.. మొయిద్దీన్ భాయ్‌ పాత్రలో కనిపించారు. అసలైతే ఈ సినిమాలో రజినీకాంత్ పాత్ర ఉండేది కాసేపే కానీ ఐశ్వర్య మాత్రం సినిమాలో రజినీనే లీడ్ రోల్ అనేట్టుగా ప్రేక్షకులను నమ్మించారు. మూవీకి సంబంధించిన ప్రతీ పోస్టర్‌లో ఆయననే హైలెట్‌గా చూపించారు. అది కూడా మూవీ ఫ్లాప్ అవ్వడానికి ఒక కారణమని ప్రేక్షకులు భావిస్తున్నారు. అసలైతే ‘లాల్ సలామ్’లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. కానీ వీరిద్దరూ గురించి ఐశ్వర్య పెద్దగా చర్చించలేదు. దీంతో రజినీకాంతే ఇందులో హీరో అని అందరూ అనుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య.. ‘లాల్ సలామ్’ రిజల్ట్‌పై స్పందించారు.


20 కెమెరాలతో షూట్..


‘‘సినిమాకు సంబంధించిన చాలావరకు ఫుటేజ్ మిస్ అయ్యింది అనే మాట నిజం. అసలు ఇలా జరిగిందేంటి అని అందరం షాక్ అయ్యాం. అది 21 రోజుల షూటింగ్ ఫుటేజ్. అది బాధ్యత లేకపోవడం వల్లే జరిగిందని చెప్పాలి. అలా జరగడం దురదృష్టకరం. మేము 10 కెమెరాల సెటప్‌తో ఒక క్రికెట్ మ్యాచ్‌ను షూట్ చేశాం. నిజమైన క్రికెట్ మ్యాచ్‌లాగా దానిని షూట్ చేయాలని అనుకున్నాం. అలా షూట్ చేసిన 20 కెమెరాల నుండి ఫుటేజ్ మిస్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు’’ అంటూ ‘లాల్ సలామ్’ సినిమా ఫుటేజ్ మిస్ అయిన విషయాన్ని బయటపెట్టారు ఐశ్వర్య రజినీకాంత్. 


అది చాలా ఛాలెంజింగ్‌..


‘‘సమస్య ఏంటంటే అప్పటికే విష్ణు, సెంథిల్, నాన్న.. అందరూ గెటప్స్ మార్చేశారు. అందుకే దానిని మళ్లీ రీషూట్ చేయలేకపోయాం. చివర్లో ఏ ఫుటేజ్ మిగిలిందో దానినే రీ ఎడిట్ చేశాం. అది చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. విష్ణు, నాన్న కలిసి అదంతా మళ్లీ షూట్ చేద్దామని ప్రోత్సహించారు కానీ చేయలేకపోయాం. అది చాలా పెద్ద ఎదురుదెబ్బ’’ అని ఐశ్వర్య రజినీకాంత్ చెప్పుకొచ్చారు. అసలు సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఫుటేజ్ మిస్ అయ్యిందని కారణాలు చెప్తున్నారని ఐశ్వర్యపై సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి. రజినీకాంత్‌లాంటి స్టార్‌ను పెట్టుకొని అలాంటి సినిమా ఎలా తెరకెక్కించారంటూ ‘లాల్ సలామ్’పై కూడా విమర్శలు వినిపించాయి. దీంతో ఇక ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.


Also Read: సౌత్ డైరెక్టర్‌తో సల్మాన్ ఖాన్ సినిమా - ఇది చాలా స్పెషల్ అంటూ పోస్ట్