Paytm Payments Bank Crisis: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ (PPBL) మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విధించిన నిషేధానికి చివరి తేదీ మార్చి 15. ఈ గడువు అత్యంత సమీపంలో ఉంది. ఆర్‌బీఐ యాక్షన్‌ తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌, తన మర్చంట్‌ ఖాతాలను ఏ బ్యాంకుకు ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), కెనరా బ్యాంక్ (Canara Bank), యెస్ బ్యాంక్ (Yes Bank), కోటక్ మహీంద్ర బ్యాంక్ (Kotak Mahindra Bank) ఈ రేస్‌లో ముందున్నాయి. వీటిలో ఏ బ్యాంక్‌ పేరు ఇప్పటికీ ఖరారు కాలేదు.


ఆర్‌బీఐ యాక్షన్‌ సమయంలో 3 కోట్ల వ్యాపారుల ఖాతాలు
వన్‌97 కమ్యూనికేషన్స్‌కు (One97 Communications) చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌, 2024 మార్చి 16 నుంచి కొత్త డిపాజిట్లు తీసుకోకుండా, రుణాలు మంజూరు చేయకుండా కేంద్ర బ్యాంక్‌ నిషేధించింది. అంతకుముందు ఉన్న చివరి తేదీ ఫిబ్రవరి 29ని మార్చి 15 వరకు పొడిగించింది. ఇప్పుడు ఈ గడువు కూడా ముగింపునకు వచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ చర్య తీసుకున్నప్పుడు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు దాదాపు 3 కోట్ల మర్చంట్ ఖాతాలు (Paytm Merchant Accounts) ఉన్నాయి. ఈ వ్యాపారులను చేర్చుకోవడానికి చేయడానికి, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌గా PPBL పని చేసింది. 


మనీ కంట్రోల్ రిపోర్ట్‌ ప్రకారం, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో ఒకదానిని ఎంపిక చేసి, PPBLకు చెందిన అన్ని మర్చంట్‌ ఖాతాలను ఆ బ్యాంక్‌కు బదిలీ చేస్తారా?, లేదా కొన్ని బ్యాంక్‌లను ఎంపిక చేసి, వాటి మధ్య పంపిణీ చేస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలీడం లేదు. ప్రస్తుతం ఈ నాలుగు బ్యాంకులు కూడా ఈ విషయంపై మౌనం దాల్చాయి.


రూ.70 కోట్ల మేర పెరగనున్న బ్యాంకుల వార్షిక వ్యయం 
నేషనల్‌ మీడియా రిపోర్ట్‌ ప్రకారం, పేటీఎంకు చెందిన వివిధ రకాల మర్చంట్‌ అకౌంట్లను ఏ బ్యాంకులు అంగీకరిస్తాయన్న అంశంపై ప్రస్తుతం మేధోమథనం జరుగుతోంది. వీటిలో ఎన్ని లావాదేవీలు రూ.2000 లోపు ఉన్నాయన్నది కూడా ముఖ్యమే. ఈ ఖాతాల నిర్వహణ కోసం ఏటా దాదాపు రూ.50 నుంచి రూ.70 కోట్ల వరకు వెచ్చించాలని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా జరిగే బిలియన్ల కొద్దీ లావాదేవీలను నిర్వహించడానికి ఇంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం.


మరోవైపు... కేంద్ర బ్యాంక్‌ విధించిన తుది గడువు ముంచుకొస్తున్న కారణంగా, ఈనెల 15 కల్లా 'థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌' (TPAP) లైసెన్స్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. TPAP లైసెన్స్‌ను 'నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా' (NPCI) ఇస్తుంది. ఆర్‌బీఐ ఆంక్షల ఫలితంగా ఈనెల 16 నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ఆగిపోతాయి. ప్రజలు UPI ద్వారా చెల్లింపులు జరిపేందుకు, పేటీఎం యాప్‌ వినియోగాన్ని కొనసాగించేందుకు TPAP లైసెన్స్‌ వీలు కల్పిస్తుంది. పేమెంట్స్‌, ఖాతాల విషయంలో బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడానికి నెలకు మించి సమయం పట్టొచ్చు కాబట్టి, గడువు లోపే లైసెన్స్‌ రావచ్చని తెలుస్తోంది. ఈ విషయంపైనా NPCI గానీ, పేటీఎం గానీ స్పందించలేదు.


మరో ఆసక్తికర కథనం: ఫోన్‌పే, పేటీఎం బాక్స్‌లు బద్దలయ్యే పోటీ - సౌండ్‌బాక్స్‌ బరిలోకి జియో