Bajaj CNG Bike: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్‌ను బజాజ్ 2024 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ మధ్య) లాంచ్ చేయనుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. అంటే మరో మూడు నెలల్లోనే ఆ బైక్ మన ముందుకు రానుందన్న మాట. ‘ఇంధన వ్యయాన్ని సగానికి తగ్గించడంలో హీరో హోండా విఫలం అయిందని, కానీ దాన్ని బజాజ్ చేసి చూపిస్తుందని’ సీఎన్‌బీసీ టీవీ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు.
ఇంధన వ్యయాన్ని, ఆపరేటింగ్ ఖర్చులను 50 శాతం నుంచి 65 శాతం వరకు తగ్గిస్తామని రాజీవ్ బజాజ్ అన్నారు. అలాగే సాధారణ ఐసీఈ వాహనాలతో పోలిస్తే వీటి ఉద్గార స్థాయి కూడా చాలా తక్కువ అని తెలిపారు. సీఎన్‌జీ ప్రొటోటైప్... కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాన్ని 50 శాతం, కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాన్ని 75 శాతం, నాన్ మీథేన్ హైడ్రోకార్బన్ ఉద్గారాలను ఏకంగా 90 శాతం తగ్గిస్తుందని నొక్కి చెప్పారు.
దీంతోపాటు 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు చూడనంత అతి పెద్ద పల్సర్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రీమియం బైకులను లాంచ్ చేయడం కంటే పల్సర్ వంటి జనాదరణ పొందిన బ్రాండ్లను అభివృద్ధి చేయడంపైనే తాము దృష్టి పెడతామన్నారు. 125 సీసీ పైబడిన విభాగం పైనే కంపెనీ దృష్టి ఉందని, ఆ విభాగంలోనే ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తామని బజాజ్ తెలిపారు. దీన్ని బట్టి బజాజ్ తీసుకురానున్న సీఎన్‌జీ బైక్ పల్సరే అయి ఉంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మరోవైపు భారతదేశంలో అప్‌డేట్ చేసిన పల్సర్ ఎన్‌ఎస్125ని కూడా బజాజ్ విడుదల చేసింది. కొత్త పల్సర్ ఎన్ఎస్125 ఎక్స్ షోరూమ్ ధర రూ.1,04,922గా ఉంది. దాని పాత మోడల్‌తో పోలిస్తే, ఇప్పుడు వచ్చిన కొత్త పల్సర్ ధర రూ. 5,000 ఎక్కువ అయింది. మార్కెట్‌లో కొత్త పల్సర్ బైక్... హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, టీవీఎస్ రెయిడర్ 125తో ఉంటుంది. 2024 బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్125కి అనేక అప్‌డేట్‌లు ఇచ్చారు. ఈ మోటార్‌సైకిల్ మస్కులర్ డిజైన్ అలాగే ఉంది. ముందు డిజైన్, ఇంధన ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లు అలాగే ఉన్నాయి. కంపెనీ హెడ్‌లైట్ ఇంటర్నల్స్‌ను కొంచెం అప్‌డేట్ చేసింది. ఈ బైక్ థండర్ ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRL)తో కూడా వస్తుంది.
ఈ బైక్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. కొత్త బజాజ్ పల్సర్ ప్రయాణంలో ఎస్ఎంఎస్, కాల్ నోటిఫికేషన్లు, ఫోన్ బ్యాటరీ స్థాయి, ఇతర నోటిఫికేషన్‌లను యాక్సెస్ చేయడానికి బైక్ రైడర్‌కు సహాయపడుతుంది. పల్సర్ ఎన్‌ఎస్1625లొ యూఎస్‌బీ పోర్టు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉన్నాయి. 2024 పల్సర్ ఎన్‌ఎస్125లో 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఈ బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. కొత్త పల్సర్ ఇంజన్ 11.8 బీహెచ్‌పీ పవర్, 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.