Indigo Flight Cushionless Seat: బెంగళూరు నుంచి భోపాల్‌కి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ మహిళా ప్యాసింజర్‌కి వింత అనుభవం ఎదురైంది. తాను బుక్ చేసుకున్న సీట్‌పై కుషన్స్ కనిపించలేదు. వెంటనే ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "Cushionless Seats" అంటూ పోస్ట్ పెట్టింది. సేఫ్‌గా ల్యాండ్ అవుతాను అనుకుంటున్నా అంటూ సెటైర్ వేసింది. ఈ పోస్ట్‌కి ఇండిగో అఫీషియల్ అకౌంట్‌ని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెట్టారు.





ఈ పోస్ట్ వైరల్ అవడం వల్ల వెంటనే ఇండిగో స్పందించింది. క్లీనింగ్ ప్రాసెస్‌లో భాగంగానే ఆ కుషన్స్‌ని తొలగించినట్టు వివరణ ఇచ్చింది. ఫ్లైట్‌ టేకాఫ్ అయ్యే ముందు ఆ కుషన్స్‌ని తీసినట్టు వెల్లడించింది. ఇది రోజూ జరిగే ప్రక్రియే అని స్పష్టం చేసింది. తమ సిబ్బంది వెంటనే స్పందించి వాళ్లకి సహకరించినట్టు వివరించింది. ఇప్పటికే ఈ పోస్ట్‌కి 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది కామెంట్స్ పెట్టారు. గతంలోనూ ఇలా కుషన్ లెస్ సీట్స్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవన్నీ ఇండిగో ఫ్లైట్స్‌లోనివే. 


"ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు థాంక్స్. కేవలం క్లీనింగ్ కోసమే ఆ కుషన్స్‌ని తొలగించాల్సి వచ్చింది. ప్యాసింజర్స్‌కి ఈ విషయాన్ని మా సిబ్బంది చెప్పింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవలు అందించాలన్నదే మా లక్ష్యం"


- ఇండిగో యాజమాన్యం