PM Modi Srinagar Visit: ఆర్టికల్ 370 రద్దు తరవాత తొలిసారి జమ్ముకశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం 53 ప్రాజెక్ట్‌లకు ప్రారంభించారు. మొత్తం రూ.6,400 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేశారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వీటిని ప్రారంభించారు. వికసిత్ భారత్ వికసిత్ జమ్ముకశ్మీర్ అజెండాతో ఈ సభను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ సభలో జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. అంతకు ముందు ప్రధాని మోదీ లోకల్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్‌ని సందర్శించారు. కశ్మీర్‌లో పర్యాటక రంగంపై దృష్టి సారించిన మోదీ సర్కార్...Swadesh Darshanలో భాగంగా రూ.1,400 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. PRASHAD స్కీమ్‌నీ లాంఛ్ చేశారు. ఇదే కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు ప్రధాని నరేంద్ర మోదీ. అంతే కాదు. పలు పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. రైతులు, వ్యాపారులతోనూ ముచ్చటించారు. ఉద్యోగావకాశాలపై స్థానిక యువతతో ముఖాముఖి మాట్లాడారు.
"జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి ప్రాజెక్ట్‌ను ఇవాళ జాతికి అంకితం చేసుకున్నాం. జమ్ముకశ్మీర్ అభివృద్ధి అనేది మాకు ఎప్పటికీ ప్రాధాన్యతే. ఎన్నో ఏళ్ల పాటు ఇక్కడి ప్రజలు ఎలాంటి పురోగతికి నోచుకోలేదు. దేశమంతా పథకాలు అమలైనా ఇక్కడి ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ ఇక్కడి ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. ఆర్టికల్ 370 పైనా ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేసింది"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే సభలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. తన నెక్ట్స్ మిషన్ Wed in India అని వెల్లడించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకునే వాళ్లు జమ్ముకశ్మీర్‌లో పెళ్లి చేసుకోవాలని సూచించారు. జమ్ముకశ్మీర్‌లో ఇప్పటికే G20 సదస్సు జరిగిందని స్పష్టం చేశారు.
"ఇప్పుడు నా దృష్టి అంతా Wed in India మిషన్ పైనే. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లు జమ్ముకశ్మీర్‌కి రావాలి. ఇక్కడే పెళ్లి చేసుకోవాలి. ఒకప్పుడు టూరిజం రంగ ప్రస్తావన వస్తే జమ్ముకశ్మీర్‌లో ఏముందిలే అని కొట్టి పారేసేవారు. కానీ...ఇప్పుడు అన్ని రికార్డ్‌లు బ్రేక్ చేసి పర్యాటక రంగం దూసుకుపోతోంది. గతేడాది 2 కోట్ల మందికి పైగా పర్యాటకులు జమ్ముకశ్మీర్‌కి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఇక్కడికి వస్తున్నారు"
- ప్రధాని నరేంద్ర మోదీ