CM Jagan Released Ysr Cheyutha Funds: దేశంలో మరే రాష్ట్రం చేయలేని విధంగా అక్క చెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. అనకాపల్లి (Anakapally) జిల్లా కశింకోట మండలం పిసినికాడలో నాలుగో విడత చేయూత నిధులను ఆయన విడుదల చేశారు. 26 లక్షల 98 వేల 931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చేయూత పథకం కింద ఒక్కో మహిళ ఖాతాలో రూ.18,750 చొప్పున నగదు వేయనున్నారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని.. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతుందని జగన్ అన్నారు. 'గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏ రోజూ ఆలోచించలేదు. మహిళలకు చేయూతనిచ్చి చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. అమ్మఒడి పథకంతో 53 లక్షల మంది తల్లులకు అండగా నిలిచాం. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదు. అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలిచ్చాం. లంచాలు, అవినీతికి తావు లేకుండా ప్రతీ పథకానికి సంబంధించిన లబ్ధిని నేరుగా ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. గతానికి, ఇప్పటికీ ఉన్న తేడాని ప్రజలు గమనించాలి.' అంటూ జగన్ పేర్కొన్నారు.


'గర్వంగా ఉంది'


మహిళా దినోత్సవం ముందు రోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా, గర్వంగా ఉందని సీఎం జగన్ అన్నారు. 58 నెలల పాలనా కాలంలో మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా అడుగులు వేశామని చెప్పారు. 'గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏనాడూ ఆలోచించలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించాం. 1,68,018 మంది అక్క చెల్లెమ్మలు కిరాణా దుకాణాలు నడుపుతున్నారు. 3,80,466 మంది అక్క చెల్లెమ్మలు ఆవులు, గేదెలు కొన్నారు. 1,34,514 మంది గొర్రెలు, మేకల పెంపకం చేస్తున్నారు. ఇప్పుడు 26,98,931 మందికి రూ.5,060 కోట్లు జమ చేస్తున్నాం.' అని సీఎం వివరించారు.


చంద్రబాబు, పవన్ లపై తీవ్ర విమర్శలు


ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, నయ వంచనలే గుర్తొస్తాయని మండిపడ్డారు. 'చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశాడు. 2014లో ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశారా.?. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు. పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారు. ఆయన్ను నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమూ లేదు. బీసీలకు ఆయన చేసింది సున్నా. ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు బీసీలు గుర్తొస్తారు. చంద్రబాబు, దత్తపుత్రుడితో కలిసి రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు. కేజీ బంగారం, ఇంటికో బెంజ్ కారు ఇస్తామంటారు.' అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


Also Read: Andhra Pradesh Women Commission Chairperson: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్శన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా