Ather Rizta Vs Ola S1 Pro: ఏథర్ ఎనర్జీ ఇటీవల భారతీయ మార్కెట్లో రిజ్టా పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది ఓలా ఎస్1 ప్రోతో నేరుగా పోటీ పడనుంది. దీన్ని కంపెనీ లాంచ్ చేసిన మొదటి 'ఫ్యామిలీ' ఈ-స్కూటర్‌గా మార్కెట్ చేస్తున్నారు. 2024 జూన్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఏథర్ రిజ్టా బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అసలు ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ప్రోల మధ్య ఉన్న పోలికలు, తేడాలు ఏంటి?


దేని ధర బెస్ట్?
ఏథర్ రిజ్టా ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.10 లక్షల నుంచి 1.45 లక్షలు మధ్యలో ఉంది. ఓలా ఎస్1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.47 లక్షలుగా నిర్ణయించారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏథర్ రిజ్టా ఒకటి. దాని టాప్ ఎండ్ వేరియంట్ ధర ఓలా ఎస్1 ప్రో జెన్2 కంటే రూ. 2,000 తక్కువ.


దేని రేంజ్ ఎక్కువ? దేని బ్యాటరీ బెటర్‌గా ఉంది?
ఏథర్ రిజ్టా 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. అయితే ఓలా ఎస్1 ప్రో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఏథర్ రిజ్టా 5.7 బీహెచ్‌పీ, 160 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంది.  ఓలా ఎస్1 ప్రో 14.7 బీహెచ్‌పీ పవర్‌ని, 195 కిలోమీటర్ల రేంజ్‌ని కలిగి ఉంటుంది. ఏథర్ రిజ్టా టాప్ స్పీడ్ 120 కిలోమీటర్లు కాగా, ఓలా ఎస్1 ప్రో గరిష్ట వేగం గంటలకు 80 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.


ఏ స్కూటీ ఛార్జింగ్‌కు ఎంత టైమ్ పడుతుంది?
ఏథర్ రిజ్టా కేవలం 6 గంటల 10 నిమిషాలలో 0 నుంచి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అయితే ఓలా ఎస్1 ప్రో పూర్తిగా ఛార్జింగ్ అవ్వడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. రెండు స్కూటర్లకు ఛార్జింగ్ సమయం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఏథర్ రిజ్టా ఎంట్రీ లెవల్, మిడ్ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి సుమారు 8 గంటల 30 నిమిషాలు పడుతుంది.


దేని ఫీచర్లు బెస్ట్?
ఏథర్ రిజ్టా వీల్‌బేస్ 1285 మిల్లీమీటర్లు కాగా, ఓలా ఎస్1 ప్రో వీల్‌బేస్ 1359 మిల్లీమీటర్లు ఉంది. సీట్ ఎత్తు విషయానికొస్తే ఏథర్ రిజ్టా (780 మిల్లీమీటర్ల) కంటే ఓలా ఎస్1 ప్రో (805 మిల్లీమీటర్లు) ముందుంది. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఏథర్ రిజ్టా (165 మిల్లీమీటర్లు)... ఓలా ఎస్ ప్రో (160 మిల్లీమీటర్లు) కంటే కొంచెం ముందుంది. ఓలా ఎస్1 ప్రో బరువు 119 కిలోలు కాగా, ఏథర్ రిజ్టా 116 కిలోల బరువు ఉంటుంది.


రెండు స్కూటర్లు 12 అంగుళాల చక్రాలను కలిగి ఉన్నాయి, వాటి అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యం 34 లీటర్లుగా ఉంది. సస్పెన్షన్ సెటప్ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో కూడా ఒకే విధంగా ఉంటుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున మోనో షాక్ యూనిట్ ఉన్నాయి. ఓలా ఎస్1 ప్రోలో ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు స్టాండర్డ్‌గా ఉంటాయి. అయితే ఏథర్ రిజ్టా మాత్రం వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!