IPL 2024: నిజమే. బహుశా కెరీర్ లో ఆఖరి ఐపీఎల్ ఆడేస్తున్న 42 ఏళ్ల మహేంద్రసింగ్ ధోనీ... ఈ వయసులోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. నిన్న ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్.. సీఎస్కే ఫ్రాంచైజీ తరఫున 250వది. అంటే ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ రెండూ కలుపుకుని. అలాంటి మైల్ స్టోన్ మ్యాచ్ లో ధోనీ ఓ రికార్డు కూడా సృష్టించాడు. అదేంటంటే... ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్ లో ఎదుర్కొన్న తొలి 3 బంతులనూ సిక్సులుగా మార్చిన తొలి భారత బ్యాటర్ గా ఎంఎస్ ధోనీ రికార్డు సృష్టించాడు. ఆఖరి ఓవర్ లో దిగి.. కేవలం 4 బాల్స్ లోనే 20 రన్స్ స్కోర్ చేసి, మ్యాచ్ ఫలితాన్నే నిర్దేశించే ఇన్నింగ్స్ ఆడాడు.
ధోని కొట్టిన 20 పరుగులతో గెలిచిన సీఎస్కే
ధోనీ ఇన్నింగ్స్ నిజంగానే గేమ్ ఛేంజర్ గా నిలిచింది. ఎందుకంటే ధోనీ స్కోర్ చేసిన 20 పరుగులే... ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అంతరం. చెన్నై సరిగ్గా అంతే తేడాతో మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ పూర్తయ్యాక మాట్లాడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్... ఆ యువ వికెట్ కీపర్ మూడు సిక్సులు కొట్టడం తమకు చాలా హెల్ప్ చేసిందని, సరదాగానే మాట్లాడుతూ ధోనీ ఇన్నింగ్స్ ఇంపార్టెన్స్ ను తెలియచేశాడు.
రాకెట్‌లా స్ట్రైక్ రేట్
గత ఏడాది, ఈ సీజన్ లోనూ... బ్యాటింగ్ ఆర్డర్ లో వీలైనంత ఆఖర్లో వస్తున్న ధోనీ... చాలా తక్కువ బాల్స్ మాత్రమే ఎదుర్కొంటున్నాడు. కానీ తన ఇంపాక్ట్ మాత్రం డబుల్, ట్రిపుల్ లెవెల్ లో ఉంటుంది. దానికి గణాంకాలే నిదర్శనం. 2023 ఐపీఎల్ నుంచి 82 బాల్స్ ఎదుర్కొన్న ధోనీ.... 199 స్ట్రైక్ రేట్ తో 163 స్కోర్ చేశాడు. అందులో 16 సిక్సులు, 7 ఫోర్లు. అంటే డెత్ ఓవర్లలో హిట్టింగ్ సామర్థ్యం ఇంకా తనలో ఉందని, వీలైనంత గట్టిగా చాటి చెప్తున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో మెరిసినా ముంబైకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్ పతిరన నాలుగు వికెట్లతో ముంబై వెన్నువిరిచాడు. ముంబై జట్టులో ఒక్క రోహిత్ శర్మ మాత్రమే మెరిశాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే సూపర్ బ్యాటింగ్‌తో భారీ స్కోరు చేసింది. చివర్లో ధోనీ నాలుగు బంతులు ఎదుర్కొని మూడు సిక్సులతో 20 పరుగులు చేశాడు.
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 186 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ మిహనా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ముంబైకు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఏడు ఓవర్లకు 70 పరుగులు చేశారు. పతిరాన ఎంట్రీతో ముంబైకు కష్టాలు మొదలయ్యాయి. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి హార్దిక్ సేనను దెబ్బకొట్టాడు. 23 పరుగులకు ఇషాన్ కిషన్ అవుటైతే.. పరుగులేమీ చేయకుండానే సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ చేరాడు. 31 పరుగులు చేసి తిలక్ వర్మ అవుటైన తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా మరోసారి విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం పోరాటాన్ని ఆపలేదు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ కొట్టాడు. రోహిత్‌కు ఒక్క బ్యాటర్ కూడా మద్దతుగా నిలవలేదు. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది