Ather Rizta Electric Scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశంలో ప్రవేశపెట్టింది. అదే ఏథర్ రిజ్టా. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 165 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించనుంది.
దీని కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. ఏథర్ రిజ్టా ఒక ఫ్యామిలీ ఈ-స్కూటర్ అని చెప్పవచ్చు. ఏథర్ రిజ్టా ధర రూ. 1.10 లక్షల నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1.45 లక్షలుగా ఉంది. ఇది స్పేస్, కంఫర్ట్ కోసం ప్రత్యేక శ్రద్ధతో రూపొందిన ప్రాక్టికల్ స్కూటర్. అందువల్ల ఇది ముందుకు మరింత వంగి ఉంటుంది. సౌకర్యం కోసం పొడవైన సీటును కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం స్టోరేజ్ కెపాసిటీ 56 లీటర్లు కాగా, ఇందులో ఫ్రంట్, అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి.
Also Read: మొదటిసారి అలాంటి కారు తయారు చేయనున్న టెస్లా - భారతదేశం కోసమే!
ఏథర్ రిజ్టా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఉన్న మొట్టమొదటి భారతదేశపు ఎలక్ట్రిక్ స్కూటర్. డిజైన్ గురించి చెప్పాలంటే ఇది కంపెనీ స్పోర్టియర్ 450 మాదిరిగానే కొన్ని వివరాలతో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీన్ని మరింత సౌకర్యవంతమైన సస్పెన్షన్ కోసం ట్యూన్ చేశారు. దీన్ని రైడ్ చేయడం మరింత సులభతరం అవుతుందని కంపెనీ తెలిపింది. ఏథర్ 450ఎక్స్‌తో పోల్చినట్లయితే, రిజ్టా కేవలం 7 కిలోల బరువు మాత్రమే ఎక్కువగా ఉంటుంది. దాని సెగ్మెంట్‌లోని తేలికైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఇది కూడా ఒకటి.
వీటిలో 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. రేంజ్ గురించి చెప్పాలంటే 2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ రేంజ్ 123 కిలోమీటర్లు కాగా, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ రేంజ్ 165 కిలోమీటర్లుగా ఉంది. రెండు వేరియంట్‌ల టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉండటం విశేషం.
రెండు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ ఫంక్షన్‌తో పాటు టాప్ ఎండ్ వెర్షన్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను పొందుతుంది. ఇవి ప్రారంభ ధరలు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ జూలై నుంచి ప్రారంభం అవుతుంది. ఐదు సంవత్సరాల వారంటీ, ఐపీ67 రేటింగ్, 400 మిల్లీమీటర్ వాటర్ వేడింగ్ కెపాసిటీ కూడా ఉన్నాయి.