Right Way To Gear Change In Bikes: బైక్ నడపడం కొన్ని సాంకేతిక విషయాలతో ముడిపడిని విషయం. ముఖ్యంగా, గేర్‌ మార్చే సమయంలో క్లచ్‌ను కరెక్ట్‌గా ఉపయోగించడం చాలా ముఖ్యం. గేర్‌ మార్చేటప్పుడు క్లచ్‌ను పూర్తిగా నొక్కాలా, సగం (హాఫ్ క్లచ్‌) మాత్రమే నొక్కాలా అనే విషయం చాలా మంది రైడర్లకు సరిగ్గా తెలియదు. క్లచ్‌ను మీరు ఎలా వాడుతున్నారు అనేదానిపై బైక్ విడిభాగాల పనితీరు, మైలేజ్ & జీవితకాలం ఆధారపడి ఉంటాయి. క్లచ్‌ను పట్టుకునే విధానం ఎంత కీలకమో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

Continues below advertisement


క్లచ్ చేసే పని ఏంటి & అది ఎందుకు కీలకం?
బైక్ ఇంజిన్ & గేర్‌బాక్స్ మధ్య కనెక్షన్‌ను నియంత్రించడానికి క్లచ్ పని చేస్తుంది. మీరు క్లచ్‌ను నొక్కిపట్టినప్పుడు, ఇంజిన్ - గేర్‌బాక్స్ మధ్య కనెక్షన్ తెగిపోతుంది & మీరు సులభంగా గేర్‌ మార్చవచ్చు. క్లచ్‌ను సరిగ్గా నొక్కకపోతే గేర్‌ మార్చడం కష్టమవుతుంది & ఇంజిన్‌పై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల క్లచ్ ప్లేట్లు త్వరగా అరిగిపోతాయి & మీ రైడింగ్ అనుభవాన్ని చేదు జ్ఞాపకంగా మారుస్తుంది. 


గేర్లు మారుస్తున్నప్పుడు పూర్తిగా క్లచ్ నొక్కాలా?
మీరు బైక్ నడుపుతున్నప్పుడు గేర్‌ మార్చాల్సి వస్తే, క్లచ్‌ను పూర్తిగా నొక్కడం మంచిది. క్లచ్ పూర్తిగా నొక్కినప్పుడు ఇంజిన్ & గేర్‌బాక్స్ మధ్య కనెక్షన్ పూర్తిగా తెగిపోతుంది, దీని వలన గేర్ షిఫ్టింగ్ సజావుగా & ఖచ్చితత్వంతో జరుగుతుంది. అదనంగా, క్లచ్‌ను పూర్తిగా నొక్కడం వల్ల క్లచ్ ప్లేట్లపై ఘర్షణ తగ్గుతుంది, తద్వారా వాటి జీవితకాలం పెరుగుతుంది. ఫైనల్‌గా, ఇది ఇంజిన్‌పై చాలా ఒత్తిడిని తగ్గిస్తుంది & బైక్ ఇంధన సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది.


హాఫ్ క్లచ్ వల్ల ఎలాంటి హాని జరుగుతుంది?
ట్రాఫిక్‌లో బైక్‌ను నెమ్మదిగా తరలించడానికి రైడర్లలో చాలా ఎక్కువ మంది హాఫ్ క్లచ్‌ ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు ఇది పని చేయవచ్చు. కానీ, అదే అలవాటుగా మారితే బైక్ క్లచ్ ప్లేట్‌లపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. హాఫ్ క్లచ్‌తో బండిని నడపడం వల్ల క్లచ్ ప్లేట్లు అధికంగా హీటెక్కుతాయి & వాటి గ్రిప్పింగ్ సామర్థ్యం బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా, ఇంజిన్ & గేర్‌బాక్స్ మధ్య సమన్వయం దెబ్బతింటుంది, ఇది బైక్ మైలేజీని కూడా తగ్గిస్తుంది. రిపేర్‌ ఖర్చులు పెరుగుతాయి & సాధారణ సమయానికి ముందే క్లచ్‌లు మార్చాల్సిన అవసరం వస్తుంది. ఈ రోజుల్లో చాలా బైక్‌లు "వెట్‌ క్లచ్ ప్లేట్‌"లతో వస్తున్నాయి, ఇవి త్వరగా కాలిపోవు. అయినప్పటికీ, హాఫ్ క్లచ్‌ను తరచుగా ఉపయోగించడం వల్ల వాటి సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది.


వాహన రంగ నిపుణులు ఏం చెబుతున్నారు?
బైక్‌ గేర్‌ మార్చినప్పుడల్లా క్లచ్‌ను పూర్తిగా నొక్కి, గేర్‌ మార్చిన తర్వాత నెమ్మదిగా రిలీజ్‌ చేయాలని ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల గేర్ మార్పు సులభంగా ఉండడం మాత్రమే కాకుండా, రైడింగ్ సమయంలో కుదుపులు ఉండవు. ఇదే అలవాటుగా మార్చుకుంటే బైక్‌పై మెరుగైన నియంత్రణ సాధించవచ్చు, ఇంజిన్, గేర్‌బాక్స్ & క్లచ్ జీవితకాలాన్ని పెంచవచ్చు. తద్వారా, రిపేరు ఖర్చులు తగ్గించి మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు.