Air Taxi In Bengaluru: కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఐటీ హబ్‌లు ఎంత ఫేమస్సో ట్రాఫిక్ జామ్‌లు కూడా అంతే ఫేమస్. ఈ నగరంలోని రోడ్లు ఎక్కువగా వాహనాలతో నిండిపోయాయి. కానీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ నుంచి ప్రజలు కొంత ఉపశమనం పొందబోతున్నారు. ఎందుకంటే బెంగళూరు సిటీలో ఎయిర్ టాక్సీని ప్రవేశపెట్టబోతున్నారు. దీని కారణంగా గంటల ప్రయాణాన్ని కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.
బెంగళూరులో ఫ్లయింగ్ టాక్సీ ప్రారంభం త్వరలో...
మనీ కంట్రోల్ కథనం ప్రకారం సర్లా ఏవియేషన్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (BIAL) కలిసి నగరంలో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని ప్రారంభించబోతున్నాయి. ఈ ఎయిర్ టాక్సీని నగరంలోని ప్రధాన ప్రదేశాలు, విమానాశ్రయం మధ్య నడపవచ్చు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీని ప్రారంభిస్తే ప్రజల ప్రయాణంలో చాలా సమయం ఆదా అవుతుంది.
ఈ కథనంలో పేర్కొన్న దాని ప్రకారం ఈ భాగస్వామ్యంలో అధునాతన ఎయిర్ మొబిలిటీ సొల్యూషన్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఈ ఎయిర్ ట్యాక్సీలు హెలికాప్టర్ల మాదిరిగా గాలిలో ఎగరడమే కాకుండా కాలుష్యం కూడా కలిగించవు. హై స్పీడ్‌తో పాటు ఎయిర్ ట్యాక్సీలను ఎకో ఫ్రెండ్లీగా మార్చడంపై కూడా కంపెనీ దృష్టి సారించింది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
ఎయిర్ టాక్సీలో ఛార్జీ ఎంత ఉంటుంది?
ఎయిర్ టాక్సీలో ప్రయాణించడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి బెంగళూరులోని ఇందిరానగర్ నుంచి విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే 1.5 గంటల సమయం పడుతుంది. అయితే ఎయిర్ టాక్సీలో ఈ సమయం కేవలం ఐదు నిమిషాలకు తగ్గించనున్నారు. కానీ ఈ ఎయిర్‌ట్యాక్సీ నివేదికల ప్రకారం ఇందులో ప్రయాణం చేయాలంటే ఒక వ్యక్తి సుమారు 20 నిమిషాల ప్రయాణానికి రూ. 1,700 వరకు ఖర్చు చేయవచ్చు.
అయితే ఈ ఎయిర్‌ట్యాక్సీ ప్రాజెక్ట్ చాలా ప్రారంభ దశలోనే ఉంది. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీకి సంబంధించిన మోడల్ ఇంకా తయారు కాలేదు. అలాగే ఇది ఆమోదం పొందడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. బీఐఏఎల్ తెలుపుతున్న దాని ప్రకారం బెంగళూరులో ఈ సర్వీస్ ప్రారంభం కావడానికి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?