కియా కార్నివాల్ కారు గతేడాది మనదేశంలో లాంచ్ అయింది. ఈ కారు మనదేశంలో మంచి సక్సెస్ కూడా అయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త వెర్షన్‌ను కియా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రీమియం ఎంపీవీ పాపులారిటీని కొనసాగించడం కోసం కియా ఈ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇందులో కియా పెద్ద మార్పులు ఏమీ చేయలేదు. కానీ కొత్త కియా లోగోను మాత్రం ఈ కారుపై చూడవచ్చు.
అయితే ఇందులో కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొత్తం నాలుగు కొత్త వేరియంట్లను కియా లాంచ్ చేసింది. అవే ప్రీమియం, ప్రెస్టీజ్, లిముజీన్, లిముజీన్ ప్లస్. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన ప్రీమియం ధర రూ.24.95 లక్షలుగా(ఎక్స్-షోరూం) ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ అయిన లిముజీన్ ప్లస్ ధర రూ.33.99 లక్షలుగా(ఎక్స్-షోరూం) ఉంది.
వినియోగదారుల అంచనాలను మించే స్థాయిలో ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి తాము పడిన శ్రమ ఫలితమే ఈ కొత్త కియా కార్నివాల్ కార్ అని కియా ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తే-జిన్ పార్క్ అన్నారు. కియా కార్నివాల్ లాంచ్ అయినప్పటి నుంచి భారతదేశ మార్కెట్లో తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకుందని తెలిపారు. ఇప్పటివరకు భారతదేశంలో 8000 కియా కార్నివాల్ యూనిట్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన కొత్త వేరియంట్లతో మరిన్ని రికార్డులు సృష్టిస్తామని నమ్మకం ఉందన్నారు. కొత్తగా లాంచ్ అయిన కియా కార్నివాల్ వేరియంట్లు కూడా భారతదేశ వినియోగదారులకు నచ్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇందులో వీఐపీ ఫెదరెట్ సీట్స్, సెకండ్ రోకి లెగ్ సపోర్ట్, యూవో సూట్ ఉన్న 8-ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టం, ఎలక్ట్రోక్రోమిక్ రేర్ వ్యూ మిర్రర్, వెనక సీట్లో కూర్చున్న ప్యాసెంజర్లకు 10.1 అంగుళాల ట్యాబ్లెట్, ఎయిర్ ప్యూరిఫయర్ ఇందులో ఉన్నాయి. దీంతోపాటు లిముజీన్ ప్లస్ వేరియంట్‌లో 8-స్పీకర్ హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టం, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 10-వే పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్, లెదర్‌తో ర్యాప్ చేసిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, క్యాబిన్‌కు ఉడ్ ఫినిష్, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, డ్యూయల్ 10.1 టచ్ స్క్రీన్లు ఇందులో ఉండనున్నాయి.
2021 కియా కార్నివాల్‌లో 18 అంగుళాల అలోయ్ వీల్స్ ఉండనున్నాయి. అయితే దీని పవర్ ట్రెయిన్‌కు మాత్రం కంపెనీ ఎటువంటి మార్పులూ చేయలేదు. ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ అందించనున్నారు. దీని బీహెచ్‌పీ 197గానూ, పీక్ టార్క్ 440ఎన్ఎంగానూ ఉండనుంది. 8-స్పీడ్ స్పోర్ట్స్‌మాటిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇందులో అందించారు.
ఇక వీటి ధరల విషయానికి వస్తే.. ఇందులో కియా కార్నివాల్ ప్రీమియం 7-సీటర్ ధర రూ.24.95 లక్షలుగా ఉంది. ఇందులోనే 8-సీటర్ వేరియంట్ ధరను రూ.25.15 లక్షలుగా నిర్ణయించారు. ప్రెస్టీజ్ 7-సీటర్ ధర రూ.29.49 లక్షలుగానూ, 9-సీటర్ ధర రూ.29.95 లక్షలుగానూ ఉంది. లిముజీన్ 7-సీటర్ ధర రూ.31.99 లక్షలుగానూ, లిముజీన్ ప్లస్ 7-సీటర్ ధర రూ.33.99 లక్షలుగానూ ఉంది.
Also Read: వావ్ అనిపించే లుక్ తో సూపర్ లగ్జరీ కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ.. ధర ఎంతంటే?
Also Read: Affordable Cars: తక్కువ ధరలో కారు కొనాలనుకుంటున్నారా.. రూ.4 లక్షల్లో టాప్-3 ఇవే!