Shiva Mantra: శ్రావణమాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల. ఈ నెలలో శివుడిని కొలిస్తే, ఏకాగ్రతతో పరమేశ్వరుడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రావణ సోమవారం రోజు ప్రత్యేక పూజలు, ఆరాధనలు, అభిషేకాలు, శివ మంత్రాల పఠనంతో తమకు నచ్చిన విధంగా పూజిస్తే పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడని, అదృష్టం వరిస్తుందని చెబుతారు. అయితే శివయ్యకు చేసే పూజలు కొన్ని రకాల వస్తువులను వాడితే మరింత పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. దేవదేవుడికి ఇష్టమైన కొన్ని ప‌త్రాల(ఆకుల)ను పూజలు భాగం చేయడం వల్ల ఆయన సంతోషిస్తాడు భావిస్తారు. అదే విధంగా ఆయ‌న‌కు అత్యంత ప్రీతిక‌ర‌మైన మంత్రాన్ని ఈ రోజు ప‌ఠిస్తే విశేష ఫ‌లిత‌ముంటుంది.


కర్పూర గౌరం కరుణావతారం అనేది శివునికి మంగళారతి సమయంలో తరచుగా వినిపించే అత్యంత ప్రసిద్ధ మంత్రాలలో ఒకటి. ఇది శివునికి సంబంధించిన పురాతన సంస్కృత శ్లోకం. దీనిని శివ యజుర్ మంత్రం అని కూడా అంటారు. కర్పూర గౌరమ్మ కరుణావతారం మంత్రం నాలుగు వేదాలలో ఒకటైన యజుర్వేదంలోని శ్లోకం. అద్భుతమైన ఈ శ్లోకానికి అర్థం తెలుసా..?


1. శివ మహిమ
శివ అనే పదానికి మంగళకరమైనది అని అర్థం. శివుడు పాపాన్ని, బాధలను పోగొట్టి భూలోకంలో సుఖాన్ని ప్రసాదిస్తాడు. శివుడు శుభప్రదుడు. శివునికి అత్యంత ముఖ్యమైన పేర్లలో శంకరుడు ఒకటి. ఆయనను శంకరుడు అని పిలవడానికి కారణం శివుడు ఎప్పుడూ మంచి చేస్తాడు. శివుడు శంకరుడు మాత్రమే కాదు హరుడు కూడా. అన్ని చెడులను తొలగించేవాడు, త్యజించే దేవుడు అని దీని అర్థం.


Also Read : ఈ ప‌దార్థాల‌తో రుద్రాభిషేకం చేస్తే క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో తెలుసా?


2. యజుర్ మంత్రం
‘‘కర్పూర గౌరం కరుణావతారం
సంసారసారం భుజగేంద్రహారం|
సదావసంతం హృదయారవిందే
భవం భవానీసహితం నమామి||''


3. ఈ శ్లోకం అర్థం
- కర్పూరం గౌరం: కర్పూరంలా తెలుపు/ కర్పూరంలా స్వచ్ఛమైనది
- కరుణావతారం: దయ, క‌రుణా స్వరూపుడు ఎవరు
- సంసారసారం: విశ్వానికి నిజమైన ఆత్మ
- భుజగేంద్రహారం: సర్పరాజాన్ని ధరించినవాడు
- సదావసంతం హృదయారవిందే: కమలం వలె స్వచ్ఛమైన హృదయంలో నివసించేవాడు
- భవం భవానీసహితం నమామి: నేను శివునికి ఆయ‌న‌ భార్య పార్వ‌తీ దేవికి నమస్కరిస్తున్నాను.


శివుడు క‌రుణావ‌తారుడు, ఆయ‌న‌ తన భక్తుల ప్రార్థనల ద్వారా సులభంగా సంతోషిస్తాడు. ఈ మంత్రాన్ని పఠించడం వ‌ల్ల‌ ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలు, శక్తులను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది, ఇది మరింత సమతుల్య, శ్రావ్యమైన అంతర్గత స్థితికి దారితీస్తుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా చ‌ద‌వ‌డం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ స‌మ‌యంలో ఉత్పన్నమయ్యే కంపనాలు శరీరంలోని శక్తి కేంద్రాలను ( చక్రాలు ) సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది శారీరక, మానసిక వైద్య ప్రక్రియలకు దోహదం చేస్తుంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల దానిని జపించే వ్యక్తి చుట్టూ సానుకూల ప్రకాశాన్ని సృష్టించవచ్చు. ఫ‌లితంగా ఇతరులతో వారి సంబంధాలు మ‌రింత మెరుగుప‌డ‌తాయి.


Also Read : శివుడిని పంచభూతాలకు అధిపతి అంటారెందుకు!


ఈ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల కష్టపడి ఏదైనా సాధించవచ్చని బోధపడుతుంది. ఈ మంత్రం అత్యంత శక్తిమంతమైన రక్షణ మంత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రతికూలత, ప్రమాదాలు, శత్రువుల నుంచి మనల్ని రక్షిస్తుంది. శివ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మన జీవితంలో అన్ని రంగాలలో విజయంతో పాటు శ్రేయస్సు లభిస్తుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.