YS Viveka Case :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి   వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.  సోమవారం కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి  కూడా అదే జైలులో ఉన్నారు.


ఏప్రిల్ 16వ తేదీ నుంచి జైల్లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి 


వైఎస్ వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ విడివిడిగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోగా.. కింది కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. ఇరువైపుల వాదనలు విన్నాక నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.


అవినాష్ రెడ్డి  బెయిల్ కూడా రద్దు చేయాలని సీబీఐ అఫిడవిట్ 


ఎంపీ అవినాశ్ రెడ్డికి  హైకోర్టు ఇచ్చిన ముందస్తు  బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అవినాశ్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశారు.   బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ కోరింది.   వైఎస్ వివేకా హత్యకు ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ అఫిడవిట్‌లో తెలిపింది.  రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ మరోమారు అఫిడవిట్‌లో తేల్చి చెప్పింది.ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని మరింత విచారించాల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. వైఎస్ వివేకా హత్య జరిగితే గుండెపోటు అని ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. వైఎస్ వివేకానందరెడ్డితోపాటు కారులో వెళ్లిన నిందితుడు గంగిరెడ్డి ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశారని..అదే సమయంలో అవినాశ్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ సైతం ఉన్నారని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది.


అప్రూవర్ గా మారిన దస్తగిరి, అవినాష్ మాత్రమే బయట


వివేకా  హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి, ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం వివేకా హత్య కేసులో  బయట ఉన్నారు. మిగతా వారంతా జైల్లో ఉన్నారు.  వివేకా హత్య కేసు పై ప్రోఫైల్ కేసు కావడంతో ఎప్పుడు ఏ పరిణామాు జరుగుతాయన్నది సంచలనంగా మారింది.