Nara lokesh on Sand Mafia: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. అయితే ప్రభుత్వ తీరును ఎండగడుతూ లోకేష్ సెల్ఫీల ఉద్యమం కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇసుక దందా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్.. వైసీపీ నేతలు అక్రమ ఇసుక దందా చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక టిప్పర్ల ముందు సెల్ఫీలు దిగి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. వైసీపీ నేత ఇసుక దందా అని లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 


‘ఇసుక బంగారమాయనే.. బెంగళూరు పోయేనే. 
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇసుక దందాకు ఇదే నిదర్శనం. ఒకేసారి తొమ్మిది ఇసుక టిప్పర్లు ఎలాంటి పర్మిట్ లేకుండా ఇసుకను బెంగళూరు తరలిస్తున్నారు. పేరుకే జేపీ కంపెనీకి కాంట్రాక్ట్.. కానీ చిత్రావతిలో ఆధిపత్యం మొత్తం కేతిరెడ్డిదే. నలుగురు అనుచరులను బినామీలుగా పెట్టుకుని ఇసుకను దోచుకుంటున్నారు..’ అని నారా లోకేష్ సంచలన ఆరోపణలతో ట్వీట్ చేశారు.






56వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ శుక్రవారం రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. బసినేపల్లిలో ఎన్టీఆర్ గృహాలను పరిశీలించారు. అనంతరం పైదిండిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అశేష జనవాహినిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఏపీ ప్రభుత్వ అసమర్థతను, మోసాన్ని ఎండగట్టారు. శుక్రవారం ఉదయం రాప్తాడు నియోజకవర్గం సీకేపల్లి చేరుకున్న లోకేష్‌ కి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు.


వైసీపీ నేతల ఫోన్లలో ఏ సీన్లు దొరకలేదా?
అంద‌రికీ విప్పి చూపించిన గోరంట్ల, గంట కావాల‌న్న అంబ‌టి, అర‌గంట చాలంటూ చెల‌రేగిన అవంతి ఫోన్లలో ఏ సీన్లూ దొర‌క‌లేదా పోలీసులూ? సోష‌ల్మీడియాలో  ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు పెడుతున్నాడ‌ని ఎన్ఆర్ఐ అంజ‌న్ పై గే అనే ముద్ర వేయ‌డం తీవ్ర నేరం అన్నారు లోకేష్. వైసీపీ కోసం ప‌నిచేసే క‌ట్టప్పల్లా మారిపోవ‌డం వ‌ల్ల, హ‌క్కులు - చ‌ట్టాలున్నాయ‌ని మ‌రిచిపోతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ల ద‌గ్గరే గంజాయి దొరుకుతుందని సెటైర్లు వేశారు. ప్రతిప‌క్షానికి మ‌ద్దతుగా ఉంటే వాళ్ల మొబైళ్ల మీరు కోరుకున్న వీడియోలు దొరుకుతాయి. శాంతి భ‌ద్రత‌ల ప‌రిర‌క్షణ మానేసిన‌ కొంతమంది పోలీసులు, ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కోసం కిరాయికి ప‌నిచేసే ఐప్యాక్ సిబ్బందిలా మారిపోవ‌డం సిగ్గుచేటు అని విమర్శించారు. ఉన్నత విద్యావంతుడు అంజ‌న్ విష‌యంలో మీరు వ్యవ‌హ‌రించిన తీరు పోలీసు వ్యవ‌స్థకే క‌ళంకం. దీనికి త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్పదు అని లోకేష్ ట్వీట్ చేశారు.