వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు చోట్ల మండల పరిషత్ పదవుల కోసం పార్టీ నేతలు వివాదాలకు దిగుతున్నారు. కొంత మంది పదవులకు రాజీనామా చేస్తున్నారు. పార్టీలో అన్యాయం జరిగిందని వాపోతున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో మండల పరిషత్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని కుమ్మరి వాండ్ల పల్లికి చెందిన వైఎస్ఆర్‌సీపీ ఎం.పి.టి.సి బత్తల రామలక్ష్మమ్మ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తమకు ఎంపీపీ పదవి ఇస్తామని మాట ఇచ్చారు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఎంపీపీ పదవి ఇస్తామని ఆశ పెట్టడంతోనే స్థోమతకు మించి ఎన్నికల్లో ఖర్చు చేశామని ఇప్పుడు మోసం చేశారని మండిపడ్డారు. కదిరి నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన రామలక్ష్మమ్మ అసంతృప్తిని చల్లార్చేందుకు ఎమ్మెల్యే సిద్ధా రెడ్డి ప్రయత్నిస్తున్నారు.  
Also Read : ఏపీపై రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ కేసులు ! అసలు వివాదాలేంటి ? బాక్సైట్, వాన్‌పిక్ పెట్టుబడులే కారణమా ?
కర్నూలు జిల్లాలోనూ వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం ఎంపీపీ పదవి ఇవ్వాల్సిందేనని  కె.నాగలాపురంకు చెందిన ఎంపీటీసీ రాజమ్మ, కార్యకర్తలతో కలిసి రోడ్డెక్కి నిరసనచేపట్టారు. ఎమ్మెల్యే ఎంపీపీ పదవి ఇస్తామని ఎన్నికల బరిలో నిలబెట్టారని ఇ్పపుడు మోసం చేశారని రాజమ్మ అంటున్నారు. తనకు న్యాయం చేయాల్సిందేనని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు ఆందోళనకు దిగారు.  పార్టీతో సంబంధం లేని చనుగొండ్ల మహేశ్వరరెడ్డి కుటుంబానికి ఆ పదవి ఇస్తున్నారని మండిపడ్డారు.  
Also Read : వైఎస్‌ఆర్‌సీపీ నేత దాష్టీకం.. దివ్యాంగురాలిపై అత్యాచారం
పలు జిల్లాల్లో మండల పరిషత్ చైర్మన్ పదవులు తమ వర్గానికే ఉండాలని ఎమ్మెల్యేలు, ఇతర నియోజకవర్గ స్థాయి నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ఆధిపత్య పోరాటం కారణంగా అనేక మండలాల్లో ఎంపీటీసీలు క్యాంప్‌లకు వెళ్లాల్సి వచ్చింది. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం తాము పేర్లను సీల్డ్ కవర్లలో పంపుతామని .. ఎవరి లాబీయింగ్‌లు పని చేయవని చెబుతోంది. ఈ అంశంపై ప్రభఉత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు.


Also Read: పాపం.. ఆ బుడ్డోడి కుటుంబానికి మరో కష్టం.. నగదు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు


మండల, జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లోనూ బలహీనవర్గాలకు సగం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఆ మేరకే పదవుల ఎంపిక చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ నేతల మధ్య విబేధాలు పెరగకుండా... ఉండేలా చూసేందుకు సజ్జల ప్రయత్నిస్తున్నారు. మత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతూ పదవుల్ని ఖరారు చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ అసంతృప్తులు తప్పడం లేదు. 


Also Read: ఇక్కడ పోలీసులకు చెప్పి మరీ కిడ్నాప్‌లు చేస్తారు.. కేసులు కూడా ఉండవు, 11 గంటల తర్వాత..


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.